iDreamPost

పోలవరం పనుల్లో వలస కూలీల జోరు.. ’మెఘా’ రికార్డు సృష్టిస్తుందా ?

పోలవరం పనుల్లో వలస కూలీల జోరు..  ’మెఘా’ రికార్డు సృష్టిస్తుందా ?

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది వలసకూలీల వ్యవహారంపై బాగా చర్చ జరిగింది. ప్రధానమంత్రి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా సుమారు 14 కోట్లమంది వలసకూలీలు దేశవ్యాప్తంగా నానా అవస్తలు పడ్డారు. సుమారు నెల రోజుల క్రితం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వలసకూలీలను వాళ్ళ సొంతూర్లకు వెళ్ళేందుకు ప్రత్యేక రైళ్ళు వేయటంతో చాలామంది తాము పని చేస్తున్న ప్రాంతాల నుండి సొంతూర్లకు వెళ్ళిపోయారు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పద్దతి కనబడుతుంది.

అయితే ఏపిలోని పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనుల విషయం మాత్రం ఇందుకు మినహాయింపనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టులో కూడా వేలాదిమంది వలసకూలీలు పనిచేస్తున్నారు. వీళ్ళంతా బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల నుండి వచ్చారు. కరోనా వైరస్ కారణంగా నెల రోజుల క్రితం కొందరు తమ రాష్ట్రాలకు వెళ్ళిపోయినా కొందరు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. దాంతో ప్రాజెక్టు పనులు మెల్లిగా ముందుకు జరిగింది.

అయితే ప్రాజెక్టు పనులు చేస్తున్న మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఐఇఎల్) తీసుకున్న చర్యలతో పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇంతకీ కంపెనీ ఏమి చేసింది ? ఏమి చేసిందంతే పై రాష్ట్రాల నుండి వేలాది మంది కూలీలను ప్రాజెక్టు దగ్గరకు తెప్పించేందుకు ప్రత్యేక రైళ్ళు వేయించుకుంది. అలాగే ప్రత్యేక బస్సులను కూడా వేయించుకుంది. అదే సమయంలో కూలీలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంది.

వీళ్ళందరికీ ఉండేందుకు ఎలాగూ కాంట్రాక్టు సంస్ధే బస, వసతి ఏర్పాట్లు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలోనే సంస్ధ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది. అందరికీ రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించటమే కాకుండా ప్రత్యేకంగా డాక్టర్లను కూడా సైట్ దగ్గరే ఏర్పాటు చేసుకున్నదట. కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని కూలీలకు ఇంతకుముందు కన్నా ఇపుడు ఎక్కువ కూలీ ఇస్తున్నట్లు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు నత్తనడక నడుస్తుంటే పోలవరం పనులు మాత్రం ఊపందుకున్నది. పనుల్లో మరింత స్పీడు పెంచేందుకు యాజమాన్యం పై రాష్ట్రాల నుండి మరింతమందిని తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బెంగాల్ కు చెందిన వలసకూలి బరోద్ సాహా మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి లేక తాము ఇంతకాలం ఇబ్బందులు పడినట్లు చెప్పాడు. రోజుకు రూ. 500 కూలీ ఇవ్వటంతో పాటు తమకు రక్షణ చర్యలు తీసుకోవటంతోనే తాము తిరిగి వచ్చినట్లు చెప్పాడు.

తొందరలో భారీ వర్షాలు కురిస్తే మళ్ళీ పనులకు ఆటంకం ఏర్పడుతుందన్న కారణంతోనే ఇపుడు అదనపు కూలీ ఇచ్చి వేలాదిమంది వలసకూలీలను రంగంలోకి దింపింది మెఘా సంస్ధ యాజమాన్యం. సూరజ్ పాల్ అనే బీహార్ కూలీ మాట్లాడుతూ లాక్ డౌన్లో కూడా తాము పనులు చేశామన్నాడు. తమకు రోజు వైద్య పరీక్షలు చేయించినట్లు చెప్పాడు. భారీ వర్షాలు మొదలయ్యేలోగానే స్పిల్ వే ఛానల్, స్పిల్ వే పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో యాజమాన్యం ఉన్నట్లు సూరజ్ పాల్ చెప్పాడు. మొత్తంమీద ఇతర ప్రాజెక్టుల్లో సంచలనాలు సృష్టిస్తున్న మెఘా కంపెనీ పోలవరం పనుల్లో కూడా రికార్డు సృష్టిస్తుందేమో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి