SNP
SNP
వరల్డ్ కప్.. క్రికెట్ ఆడే ప్రతి జట్టుకి ఒక డ్రీమ్ లాంటిది. 1983లో కపిల్ డెవిల్స్ కప్ గెలిచాక, టీమిండియాకి అది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఇక 2000 సంవత్సరంలోకి వచ్చే సరికి టీమ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరల్డ్ కప్ కాదు కదా.. మామూలు మ్యాచ్‌లు గెలవడమే కష్టంగా మారిపోయింది. కానీ.., 2003 వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుతమే చేసింది. మనకన్నా ఎంతో బలంగా ఉన్న జట్లని వెనక్కి నెట్టి.. ఏకంగా ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా 2003 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత జట్టు.. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ వరకు చేరింది. జట్టులోని ఓ ముగ్గురు ఆటగాళ్లు.. సచిన్ టెండూల్కర్, కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ మినహా.. ఇంకెవరికీ కూడా తాము ఫైనల్ వరకు వెళ్తాం అనే నమ్మకం కూడా లేదు. అలాంటి జట్టు ఫైనల్ వరకు వచ్చి.. ఫైనల్లో ఓ ఆటగాడి విధ్వంసానికి బలైపోయింది. వరల్డ్ కప్‌ను ముద్దాడలనుకున్న జట్టును, ఓ మృగం వచ్చి వేటాడినట్టు వేటాడు అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్. అతని దెబ్బకు టీమిండియా ఆశలు సర్వనాశనం అయ్యాయి. అభిమానుల కళ్ల నుంచి నీరు కాదు.. రక్తం కారింది. సచిన్, దాదా, ద్రవిడ్ ముఖాలపై నెత్తురు చుక్కలేదు. ఒక్క ఓటమి.. ఒకే ఒక్క ఓటమి.. ఇండియన్ క్రికెట్‌ను కన్నీళ్ల సముద్రంలో ముంచేసింది.
2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఆ ఘోర ఓటమిని తల్చుకుంటే.. ఇప్పటికీ చాలా మంది భారత క్రికెట్ అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. క్రికెట్ దేవుడు సచిన్ పరుగుల వరద పారుస్తూ.. పెద్ద టీమ్స్‌ను మట్టి కరిపిస్తూ టీమిండియా ఫైనల్ వరకు చేరి, ఓటమిపాలైంది. ఆ వరల్డ్ కప్‌లో టీమిండియా జర్నీ ఓ అద్భుతం. సూర్యుడు ఉదయిస్తున్నట్లు.. విత్తనం మొలిచి.. మొక్కై.. మాహా వృక్షం అయినట్లు.. గంగూలీ సేన ప్రస్థానం సాగింది. అలాంటి జట్టుకు తుది పోరులో ఎదురైన ఓటమి, సగటు క్రికెట్ అభిమాని చేత కన్నీళ్లు పెట్టించింది. ఇప్పటికీ అదో పీడకలలా వేధించడానికి కారణాలు ఏంటో చూద్దాం..
దేశం మొత్తం క్రికెట్ పిచ్చితో ఊగిపోయిన క్షణాలు.. ఎవరి నోట విన్నా.. ఏ చోట చూసినా ఒక్కటే టాపిక్. సచిన్ అదరగొట్టాడు, గంగూలీ సిక్స్ బాదేశాడు, జహీర్ ఖాన్, నెహ్రా సూపర్‌గా బౌలింగ్ చేశారు. 2003 ఫిబ్రవరి-మార్చిలో ఓ నలుగురు కలిస్తే చర్చించుకున్న విషయాలు ఇవే. 2003 వరల్డ్ కప్‌లో ఏ మాత్రం అంచనాలు లేని ఓ జట్టు.. ఫైనల్ వరకు చేరింది. అలా చేరుతున్న క్రమంలో క్రికెట్‌ను మతంలా భావించే మన దేశ ప్రజలు వారికి అదే స్థాయిలో మద్దతు తెలుపుతూ వచ్చారు. జింబాబ్వే, కెన్యా, నమిబియా లాంటి చిన్న చిన్న జట్లతో పాటు ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ లాంటి పెద్ద టీమ్స్‌ను మట్టికరిపిస్తూ.. ఇండియా ఫైనల్‌కు చేరడంతో.. దేశవ్యాప్తంగా అభిమాన సంద్రం ఉప్పొంగింది.
ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా విశ్వవిజేతగా అవతరిస్తుంది. అప్పటికే సచిన్, గంగూలీ, ద్రవిడ్, యువరాజ్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. జవగళ్ శ్రీనాథ్, జహీర్‌ఖాన్, నెహ్రా, హర్భజన్‌తో బౌలింగ్ ఎటాక్ పటిష్టంగా ఉంది. దీంతో.. ఇండియన్ క్రికెట్ అభిమానులు సైతం భారత జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, టోర్నీ ఆరంభంలో టీమిండియాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు కానీ, జట్టు ఫైనల్‌కు చేరుతుందన్న నమ్మకం కానీ లేదు. అభిమానులకే కాదు జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు సైతం టీమిండియా ఫైనల్‌కు వెళ్తుందన్న విశ్వాసం లేదు. ముగ్గురు మాత్రం కప్పు కోసం కలలుకన్నారు. తాము వరల్డ్ కప్ సాధిస్తామని నమ్మారు. ఆ ముగ్గురే.. సచిన్, గంగూలీ, ద్రవిడ్. వారికున్న నమ్మకాన్ని యువ క్రికెటర్లలోనూ నింపుతూ.. జట్టును ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కిస్తూ.. ఫైనల్ వరకు చేర్చారు.
అప్పటి వరకు టీమిండియా ప్రదర్శన చూసిన వారికి.. కప్పు వాళ్లదే అనిపించింది. కానీ, ఒక్కడు.. ఒకే ఒక్కడు మృగంలా టీమిండియాపై పడ్డాడు. ఆ ఒక్కడే రికీ పాంటింగ్. ఫైనల్‌లో భారత బౌలర్లను చీల్చిచెండాడుతూ.. టీమిండియా ముందు 359 పరుగుల కొండంత స్కోర్‌ను పెట్టేశాడు. ఓపెనర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్-మ్యాథ్యూ హేడెన్ తొలి వికెట్‌కు 105 పరుగుల పార్ట్నర్‌షిప్‌తో గట్టి పునాది వేస్తే.. దానిపై పాంటింగ్ 359 పరుగుల కోటను నిర్మించాడు. 50 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆస్ట్రేలియా 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. జహీర్‌ఖాన్, శ్రీనాథ్, నెహ్రా, హర్భజన్ సింగ్‌లను చీల్చి చెండాడుతూ.. పాంటింగ్ 121 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సులతో 140 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. పాంటింగ్ ఇన్నింగ్స్ తర్వాత.. సచిన్, గంగూలీ, ద్రవిడ్ ముఖాలపై నవ్వు చెదిరిపోయింది. మ్యాచ్ చేజారిపోయింది. భారత క్రికెట్ అభిమానుల కళ్లలో నీళ్లు కాదు, నెత్తురు కారింది. ఆ ఓటమి తాలుకు బాధ ఇప్పటికీ చాలా మంది క్రికెట్ అభిమానుల గుండెలను పిండేస్తుంటుంది. ఒక్క మ్యాచ్, ఒక్క ఆటగాడు.. ఇండియాకు వరల్డ్ కప్‌ను దూరం చేశాడు. ఆ మ్యాచ్‌లో పాంటింగ్ ఆట చూసి.. అతను బ్యాట్‌లో స్ప్రింగులు పెట్టి ఆడాడనే పుకార్లు కూడా చెలరేగాయి. అలా సాగింది అతని విధ్వంసం. వరల్డ్ కప్ గెలవాలనే సచిన్ కల, భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలనే దాదా సంకల్పాన్ని పాంటింగ్ ఒక్కడే అడ్డుకున్నాడు. తరువాత కాలంలో సచిన్ వరల్డ్ కప్ కల నెరవేర్చుకున్నా.. గంగూలీ, ద్రవిడ్ లాంటి లెజండ్స్ కి అది కలగానే మిగిలిపోయింది.
ఈ 20 ఏళ్లలో భారత్ ఒక్కసారి మాత్రమే ఆ కప్ గెలిచింది. కానీ.., ఎందుకు ఆ ఫైనల్ మాత్రమే భారతీయులు మర్చిపోలేరు అంటే చాలా కారణాలు ఉన్నాయి. టీమ్ పరిస్థితి దిగజారి పోతున్న వేళ ముగ్గురు లెజండ్స్.. సర్వం అడ్డేసి నిలబడ్డారు. ఆట సచిన్ చూసుకుంటే, రక్షణగా ద్రవిడ్ నిలబడితే.. క్రికెట్ లో ఉన్న కుళ్ళు, కుతంత్రాలను ప్రక్షాళన చేస్తూ.. గంగూలీ యువ రక్తాన్ని జట్టులో నింపాడు. రిటైర్‌మెంట్ ప్రకటించి వెళ్ళిపోయిన జవగళ్ శ్రీనాథ్‌ని మళ్ళీ పిలిపించాడు. ప్రొటీస్ గడ్డపై జహీర్ ఖాన్, నెహ్రా సింహాల్లా రెచ్చిపోయారు. వారికి శ్రీనాథ్ అనుభవం తోడైంది. ఇక బ్యాటింగ్ లో సచిన్, గంగూలీ, ద్రవిడ్ ప్రాణాలు పెట్టి ఆడేశారు. ఆ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో టాప్ 10 హయ్యెస్ట్ స్కోరర్స్ లో ఫస్ట్ ప్లేస్ సచిన్ ది. సెకండ్ ప్లేస్ గంగూలీది. సచిన్ 6 హాఫ్ సెంచరీలు బాధగా, గంగూలీ ఏకంగా 3 సెంచరీలు కొట్టేశాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో కురాళ్ళతో కలిసి బ్యాటింగ్ చేసిన ద్రవిడ్ సగటు.. ఆ వరల్డ్ కప్ లో 63కి పై మాటే. ఇలా.. అందరూ కష్టపడ్డ వరల్డ్ కప్ అది. ఈ రోజు మనం లెజండ్స్‌గా కీర్తిస్తున్న ఆ ముగ్గురు త్రిమూర్తులు ఆ కప్ కోసమే సర్వం ఒడ్డి పోరాడారు. అయినా.. తుది అంకంలో ఫలితం చేజారింది. పాంటింగ్ కారణంగా ఆ కప్ మన చేజారినా.. టీమ్ ఇండియాకి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు అందించిన వరల్డ్ కప్ గా 2003 కప్ ఎప్పటికీ నిలిచి పోతుంది. మరి.. ఆ వరల్డ్ కప్ లో మీకు బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. ఈసారి వరల్డ్ కప్ టీమిండియాదే.. ఫైనల్లో ప్రత్యర్థి కూడా ఫిక్స్!