iDreamPost

ప్రపంచ కప్ భారత క్రికెట్ జట్టు కీపర్ కాబోయేది ఎవరో…?

ప్రపంచ కప్ భారత క్రికెట్ జట్టు కీపర్ కాబోయేది ఎవరో…?

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత తొమ్మిది నెలలుగా విశ్రాంతి పేరుతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్‌లకి భారత సెలెక్టర్లు అవకాశం కల్పించి పరీక్షించారు. వీరిలో మిగతా ఇద్దరి కంటే ఎక్కువగా ధోనీ స్థానంలో ఈ ఏడాది జనవరి వరకూ రిషబ్ పంత్‌కి వరుసగా అవకాశాలు దక్కాయి. కానీ అతను జట్టు యాజమాన్యం అంచనాల మేర రాణించలేకపోయాడు.ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ టోర్నీకి ఎవరిని కీపర్‌గా ఎంపిక చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తొమ్మిది నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్న మిస్టర్ కూల్ ధోనీ ఐపీఎల్-2020లో తన సామర్థ్యాన్ని నిరూపించుకొని ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు.కానీ కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ పదమూడో సీజన్ నిరవధికంగా వాయిదాపడటంతో వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసే జట్టులో ఎంఎస్ ధోనికి అవకాశాలు మూసుకు పోయినట్లే భావిస్తున్నారు.ప్రస్తుతం జట్టులో రెగ్యులర్‌ వికెట్ కీపర్‌ స్థానానికి రాహుల్, పంత్ మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది.ఈ ఇద్దరిలో ఎవరికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్తాని సోషల్ మీడియాలో ప్రశ్నించగా వీరి ఎంపికపై స్పందించాడు.

భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్తా తన కీపర్ ఎంపిక గురించి మాట్లాడుతూ “టీ20లలో వికెట్ కీపర్‌గా తొలి ప్రాధాన్యత కేఎల్ రాహుల్‌ మాత్రమే.భారత్ తరఫున కీపింగ్ ఎలా చేయాలి, అలాగే బ్యాటింగ్ ఎలా ఆడాలి అనేదానిపై అతని స్పష్టమైన అవగాహన ఉంది. అతను టెక్నికల్‌గా మెరుగైన కీపర్,పైగా సమర్థుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. కానీ యువ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్‌ని సెలక్టర్లు ఇలాగే వదిలేయాలని కాదు. జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అతనికి టీమిండియా జట్టు యాజమాన్యం మద్దతుగా నిలవాలి. దేశవాళీ టోర్నీలలో ఆడి తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకునే లాగా అతడిని ప్రోత్సహించాలి’’ అని పేర్కొన్నాడు.

ఈ ఏడాది స్వదేశంలో జనవరిలో ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరిగింది.ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ తాత్కాలికంగా కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు.ఆస్ట్రేలియాతో చివరి రెండు వన్డేలలో కీపర్‌గా రాణించిన రాహుల్ బ్యాట్స్‌మెన్‌గానూ 99 పరుగులు చేశాడు. ఆ తర్వాత కివీస్ గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20లలో 224 పరుగులు, మూడు వన్డేల సిరీస్‌లో 204 పరుగులు చేసి అద్భుత నైపుణ్యం ప్రదర్శించాడు.దీంతో ఈ రెండు సిరీస్‌లోనూ కీపర్‌గా రాహుల్‌ని కొనసాగించిన టీం మేనేజ్‌మెంట్ పంత్ మళ్లీ ఫిట్‌నెస్ సాధించిన తుది జట్టులో స్థానం కల్పించలేదు.

ఈ నేపథ్యంలో లిమిటెడ్ ఓవర్‌ల మ్యాచ్‌లలో రాణిస్తున్న కేఎల్ రాహుల్‌నే కీపర్‌గా ప్రపంచ కప్‌కి ఎంపిక చేయాలని కొందరు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రొఫెషనల్ వికెట్ కీపర్‌లని పక్కనపెట్టి కేవలం దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్‌‌లో కీపింగ్ చేసే రాహుల్‌కి అంతర్జాతీయ స్థాయిలో రెగ్యులర్‌గా కీపింగ్ బాధ్యతలు అప్పగించడం శ్రేయస్కరం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి