iDreamPost

భేటీ లక్ష్యం చెప్పిన వర్ల రామయ్య.. ఆ ముగ్గురి భేటీ ముందే తెలుసా..?

భేటీ లక్ష్యం చెప్పిన వర్ల రామయ్య.. ఆ ముగ్గురి భేటీ ముందే తెలుసా..?

ఈ నెల 13వ తేదీన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్, ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్లు హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో భేటీ అయిన విషయం ఈ రోజు బయటకు పొక్కడంతో రాజకీయ దుమారం రేగింది. వారు ముగ్గురు హోటల్‌కు రావడం, ఒకే గదిలోకి వెళ్లడం దృష్యాలు బయటకొచ్చాయి. ఇవి సోషల్‌ మీడియాతోపాటు న్యూస్‌ ఛానెల్స్‌లో విరివిగా ప్రసారం కావడంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవిపై నెలకొన్న వివాదం ప్రస్తుతం సుప్రిం కోర్టులో ఉన్న సమయంలో వీరు భేటీ కావడం టీడీపీ, వైసీపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ భేటీ కావడంతో వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. తాము ముందు నుంచి చెబుతున్నట్లు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాజకీయాలు చేస్తున్నారని ఇప్పుడు రుజువైందని చెబుతున్నారు. వారు ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబు మార్గదర్శనంలోనే వీరు ముగ్గురు భేటీ అయి కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతల అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు ఆరోపించారు.

వైసీపీ నుంచి విమర్శలు రావడంతో టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ నేతలైన సుజనా, కామినేని శ్రీనివాస్, మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌లు ఎందుకు భేటీ అయ్యారో చెప్పారు. ‘‘ఎస్‌.. కామినేని శ్రీనివాస్‌ గారు, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌గారు, సుజనా చౌదరిగారు కలిసి మాట్లాడుకున్నారు. మీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై, మీ వింత పోకడలపై, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న తీరుపై చర్చించారు. ఏం తప్పా..?’’ అంటూ ప్రశ్నించారు.

వర్ల రామయ్య ప్రెస్‌మీట్‌కు తర్వాత.. ఈ భేటీలో కీలకంగా ఉన్న సుజనా చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు. కామినేని, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌లతో తాను వేర్వేరుగా భేటీ అయ్యానని చెప్పారు. కామినేని రాజకీయాలు చర్చించానని తెలిపారు. తన ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయిన నిమ్మగడ్డతోనూ ఇతర విషయాలు మాట్లాడానని తెలిపారు.

సుజనా చౌదరి ప్రకటన ఇలా ఉంటే.. అందుకు భిన్నంగా వర్ల రామయ్య చెబుతుండడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. వీరు ముగ్గురు భేటీ అవడం ముందే వర్లకు తెలిసినట్లు ఆయన మాటల ద్వారా అర్థం అవుతోంది. అంతేకాకుండా ఏ లక్ష్యంతో వారు భేటీ ఆయ్యారో కూడా వర్ల చెప్పడంతో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. వీరి భేటీ వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వర్ల రామయ్య పరోక్షంగా ఒప్పుకునట్లేనని భావించాల్సి వస్తోంది.

2019 ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ సుజనా చౌదరి టీడీపీలోనే ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పోటీ చేయని సుజనాను చంద్రబాబు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపారు. టీడీపీలో ఆర్థిక వ్యవహారాలన్నీ సుజనానే చక్కబెట్టేవారని అందరూ అనుకుంటారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేటు చేసుకున్న ఓటుకు నోటు కేసులో నగదు సమకూర్చడంపై సుజనాపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబే సుజనా చౌదరిని బీజేపీలోకి పంపారని వైసీపీ నేతలు ఇప్పటికీ విమర్శిస్తుంటారు. సుజనా బీజేపీలో ఉన్నా కూడా టీడీపీ నేత మాదిరిగానే రాజకీయాలు చేస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు.

సుజనా మాదిరిగానే కామినేని శ్రీనివాస్‌పై కూడా ఇవే విమర్శలున్నాయి. నిమ్మగడ్డ వ్యవహారంలో కామినేని హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేయడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా వారి మధ్య జరిగిన భేటీలో ఎస్‌ఈసీ పదవి, ఇతర రాజకీయాలు చర్చకు రాలేదని సుజనా చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేదు. ఆవేశంలోనో, లేదా నిమ్మగడ్డను సమర్థించాలనే లక్ష్యంతోనో వర్ల రామయ్య నిజాలు చెప్పినట్లుగా ఉంది. ఈ భేటీ రాజకీయం ఎంత వరకు దారి తీస్తుందో, చివరికి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి