Dharani
Dharani
మద్యపానం వల్ల ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయో.. ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మన సమాజంలో చోటు చేసుకుంటున్న నేరాల్లో.. ఎక్కువ శాతం వాటికి ప్రధాన కారణం మద్యపానం. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి విచక్షణ కోల్పోతాడు. మంచి, చెడు మర్చిపోతాడు. తన శరీరం, మనసు మీద నియంత్రణ కోల్పోతాడు. ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. ఇక అలా ఒంటి మీద స్పృహ లేని స్థితిలో ఉన్న వ్యక్తి చేతిలో ఒక వాహనం ఉంటే.. ఇంకేమైనా ఉందా.. దాన్ని రోడ్ల మీద కాదు.. గాల్లో పరిగెత్తిస్తాడు.. అమాయకుల ప్రాణాలను గాల్లో కలిపిస్తారు. మద్యాపానం, అతివేగం కారణంగా ప్రతి రోజు ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా విశాఖలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న మహిళ రాష్ డ్రైవింగ్ కారణంగా.. ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
విశాఖపట్నంలో మద్యం మత్తులో ఉన్న మహిళ రాష్ డ్రైవింగ్ కారణంగా కారు బీభత్సం సృష్టించింది. తాగిన మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేయడంతో.. ఇన్నోవా కారు అదుపు తప్పి.. 8 వాహనాలను ఢీకొట్టింది. నగరంలోని వీఐపీ రోడ్డులోని సోమా పబ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ చేసిన మహిళ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. రామాటాకీస్ వైపు నుంచి సిరిపురం వైపు వెళ్తున్న ఈ ఇన్నోవా కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో పార్కింగ్ చేసి ఉన్న బైక్‌లను ఢీకొట్టి.. డివైడర్ ఫుట్‌పాత్‌పైకి ఎక్కేసింది. ఆ తర్వాత అక్కడున్న ఓ చెట్టును ఢీకొట్టిన ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో కారు, 8 బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్నది ఓ మహిళా డాక్టర్ అని.. ఆమె మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం తర్వాత కారులో ఉన్నవారు.. దాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.