iDreamPost

శ్రీవారి ఆస్తుల వేలం నిలిపివేత

శ్రీవారి ఆస్తుల వేలం నిలిపివేత

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన పలు నిరర్థక ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో లోతైన చర్చ, ధార్మిక సంస్థలో సమాలోచనలు తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకు ముందు ఈ విషయంలో టీటీడీ చైర్మన్‌ కూడా దాదాపు ఇదే నిర్ణయాన్ని వెలువరించారు. తాము శ్రీవారి ఆస్తుల వేలానికి నిర్ణయం తీసుకోలేదని, ర్యూట్‌ మ్యాప్‌ మాత్రమే సిద్ధం చేశామని పేర్కొన్నారు. ధార్మిక సంస్థలతో చర్చించి, సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత వేలం వేయాలా..? వద్దా..? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా, దేశంలో వివిధ ప్రాంతాల్లో శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు, పోలాలలో సంరక్షణ కష్టమైన వాటిని విక్రయించి, ఆ సొమ్మును శ్రీవారి పేరున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లోని 50 ఆస్తుల వేలం నిర్వహణకు సిద్ధమైంది. ఆస్తుల వివరాలు, వాటి ధరలతో ఉత్తుర్వులు జారీ చేసింది. అయితే శ్రీవారి ఆస్తులు విక్రయించవద్దని దేశ వ్యాప్తంగా భక్తులు విజ్ఞప్తి చేయడంతో వారి కోరిక మేరకు ఆస్తుల వేలంను ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి