iDreamPost

‘మెలోడీ బ్రహ్మ’ చేతిలో 3 అస్త్రాలు

‘మెలోడీ బ్రహ్మ’ చేతిలో 3 అస్త్రాలు

సాధారణంగా సంగీత దర్శకుడు ఎవరైనా ఓ వెలుగు వెలిగి తర్వాత ఫామ్ కోల్పోయి మళ్ళీ కం బ్యాక్ అవ్వడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏఆర్ రెహమాన్ సైతం మునుపటి మేజిక్ చేయలేక ఏదో బ్రాండ్ తో నెట్టుకొస్తున్నాడు కానీ ఇతని మ్యూజిక్ అభిమానులకు సైతం పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. ఇళయరాజా, కోటి, కీరవాణి లాంటి అగ్రజులంతా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు కానీ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ అయితే రేర్ గా వస్తున్నాయి. మణిశర్మ పని కూడా అంతే అనుకున్నారు మొన్నటిదాకా.

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు డే అండ్ నైట్ షిఫ్టులు వేసుకుని మరీ పని చేసిన ఈ మెలోడీ బ్రహ్మ నెంబర్ వన్ చైర్ మీద ఏళ్లతరబడి కూర్చున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి హీరోలు మణిని తప్ప ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు.ఇదంతా గతం. రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ తన మునుపటి డిమాండ్ ను అందుకున్న మణిశర్మ తాను ప్రస్తుతం సంగీతం అందిస్తున్న మూడు క్రేజీ సినిమాలు చాలా కీలకంగా మారాయి.

అందులో మొదటిది రెడ్. రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీపై ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. ఇస్మార్ట్ ని మించిన ట్యూన్స్ ఇస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అసురన్ రీమేక్ గా రూపొందుతున్న వెంకటేష్ నారప్పకు కూడా మణిశర్మనే సంగీత దర్శకుడు. ఇందులో బీజీఎమ్ కు చాలా ప్రాధాన్యం ఉంది. టెంపర్ సినిమాకు అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ట్యూన్స్ కన్నా మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరే ఎక్కువ హై లైట్ కావడం ఎవరూ మర్చిపోలేదు.

ఇక వీటికన్నా చాలా కీలకమైంది ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి సినిమాతోనే కెరీర్ మొదలుపెట్టి బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, మృగరాజు, ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ లాంటి సూపర్ హిట్స్ కి పనిచేసిన మణిశర్మకు ఇప్పుడీ ఆచార్య గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. తనకు బ్రేక్ ఇచ్చిన హీరో మూవీ కాబట్టి మణిశర్మ నుంచి బెస్ట్ ఆశించడం అత్యాశ కాదు. ఒకవేళ ఈ మూడు సినిమాలు అంచనాలు అందుకోగలిగితే కేవలం రెండు మూడు ఆప్షన్స్ మాత్రమే ఉన్న టాలీవుడ్ కు మరో సంగీత దిగ్గజం అందుబాటులోకి వచ్చినట్టే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి