iDreamPost

చంద్రబాబు అండ్‌ కో.. జాతీయ మీడియా పాట.. అందుకేనా..?

చంద్రబాబు అండ్‌ కో.. జాతీయ మీడియా పాట.. అందుకేనా..?

మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన వచ్చి దాదాపు 50 రోజులు కావస్తోంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టు విడవకుండా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఉద్యమం మహోగ్రరూపం తీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు.

కానీ మూడు నాలుగు గ్రామాలను దాటి కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు కూడా అమరాతి ఉద్యమం పాకలేదు. ఇక లాభం లేదనుకుని అమరావతికి ఉన్న అనుకూలతలు, ఇప్పటి వరకు పూర్తయిన భవనాలను గురించి వివరిస్తూ ప్రత్యేక కథనాలు వండి వార్చాయి. మరో వైపు విశాఖ వల్ల వచ్చే ఇబ్బందులు, దూరాబారాలు, ప్రతికూలతలు గురించి విరివిగా కథనాలు ప్రచురించాయి. వాటిని పట్టుకుని చంద్రబాబు మళ్లీ మీడియా సమావేశాలు పెట్టి అందులోని వివరాలనే మళ్లీ మళ్లీ వల్లె వేసేవారు.

ఇంతలా పోరాడినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేకపోగా తన పని తాను చేసుకుపోతోంది. మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెంతుతాయనే తన వాదనకు ఆది నుంచి కట్టుబడి ఉంటూ ముందుకు వెళుతోంది. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ.. తీర్మానానికి అసెంబ్లీ కూడా ఆమోదముద్ర వేసింది. కార్యాలయాల తరలింపునకు పూనుకుంది. ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు అవసరమైన భూములు, భవనాల వేట కొనసాగిస్తోంది.

ఇంత చేసినా.. ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ చంద్రబాబు అండ్‌ కో ను పట్టించుకోవడంలేదు. ఇలా అనడం కంటే.. నమ్మడంలేదనడమే బాగుంటుందేమో..? అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మంత్రుల కమిటీ, దర్యాప్తు సంస్థలు తేల్చాయి. కొంటే తప్పేంటంటూ చంద్రబాబుతో సహా ఆ పార్టీ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు తమపై వచ్చిన ఆరోపణలపై కౌంటర్లు ఇస్తున్నారే తప్పా.. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని మాత్రం చెప్పడంలేదు. మరో వైపు రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే చుట్టుపక్కల గ్రామాల్లో 4070 ఎకరాలు కారుచౌకగా కొన్నారని పేర్లు, సర్వే నంబర్లతో సహా ప్రభుత్వం వెల్లడిస్తోంది. దీన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబు అండ్‌ కో ఏమి చెప్పినా.. ఏమి రాసినా.. ప్రజలు పట్టించుకోవడంలేదని చంద్రబాబు అండ్‌ కో గమనించనట్లున్నారు.

ఇక ఇలా లాభం లేదనుకున్నారే ఏమోగానీ చంద్రబాబు అండ్‌ కో.. మరో దారిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి అనుకూలంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ‘జాతి’ మీడియా వల్ల కాదని జాతీయ మీడియాను చంద్రబాబు నమ్ముకున్నట్లున్నారు. జాతీయ మీడియాలో కథనాలు (రాశారా..? రాయించారా..?) వచ్చాయంటూ ఆయా కథనాలను ఆంధ్రజ్యోతి పత్రిక ఇటీవల ప్రచురించింది. అన్ని పత్రికల క్లిప్పింగులు పెట్టి దానిలోని సారాంశాన్ని వివరించేందుకు దాదాపు ముప్పావు పేజీ కేటాయించింది.

నిన్న సోమవారం చంద్రబాబు జాతీయ మీడియా కూడా జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తున్నాయంటూ గోడువెళ్లబోసుకున్నారు. పెద్ద స్క్రీన్‌పై ఆయా కథనాల క్లిప్పింగులు వేసి తామే కాదు.. జాతీయ మీడియా కూడా ఇలానే చెబుతోందని నమ్మండి మహా ప్రభో.. అంటూ అలుపొచ్చేలా చాటి చెబుతున్నారు. బాబు అండ్‌ కో అవస్థలు చూస్తున్న ప్రజలు, రాజకీయ పరిశీలకులు పగోడికీ వద్దు ఈ కష్టం అంటూనే.. ఈ కష్టం వెనుక ఉన్న మర్మంపై చలోక్తులు విసురుతున్నారు. జాతీయ మీడియా చెప్పిందని బాబు చెబుతున్న విషయం ప్రజలు నమ్ముతారా..? లేక ఆ కథనాలు కూడా చంద్రబాబే రాయించాడనుకుంటారా..? చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి