iDreamPost

రాజారెడ్డి నుంచి జగన్ వరకు — విజయసాయిరెడ్డి ప్రయాణం

రాజారెడ్డి నుంచి జగన్ వరకు —  విజయసాయిరెడ్డి ప్రయాణం

రాజకీయాల్లోగానీ, సాధారణ జీవితంలోగానీ ఒక వ్యక్తి నమ్మకం పొందడం ఒక ఎత్తు అయితే.. దాన్ని కొన్న తరాల పాటు నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అలాంటివి కొందరికి మాత్రమే సాధ్యమవుతాయి. అలాంటి కోవలేకే చెందుతారు వేణుంబాక విజయసాయిరెడ్డి. వైఎస్‌ కుటుంబంలో దివంగత రాజారెడ్డి హయాం నుంచి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ద్వారా ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నమ్మకస్తుడిగా ఉంటూ ఆయన పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. రాజా రెడ్డి వ్యాపారాలకు ఆడిటర్ గా ఉంటూ దగ్గరైన సాయిరెడ్డి.. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్‌ వెన్నంటే ఉంటూ ఆ కుటుంబ సాన్నిహిత్యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

జననం.. విజయసాయిరెడ్డి కుటుంబ నేపథ్యం..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, తాళ్లపూడి గ్రామంలో 1957 జూలై 1న సామాన్య రైతు కుటుంబంలో విజయసాయిరెడ్డి జన్మించారు. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉంటూ సీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత చార్టెడ్‌ అకౌంటెంట్‌గా కొన్ని సంవత్సరాల పాటు పలు కంపెనీల్లో పనిచేశారు. మొదట చెన్నైలోనూ ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లలో పనిచేశారు. కొన్ని సొంత కంపెనీలను కూడా ప్రారంభించారు. 1990 ప్రాంతంలో వైఎస్‌ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి వ్యాపారాలకు ఆడిటర్‌గా ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు వైఎస్‌ జగన్‌ మంచి వ్యాపారవేత్త. పలు కంపెనీలను నిర్వహించేవారు. వాటికి కూడా విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా వ్యవహరించేవారు.

విజయసాయి రెడ్డి లక్కిరెడ్డి పల్లె (2009లో రద్దయ్యి రాయచోటిలో కలిసింది ) నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట రామసుబ్బారెడ్డి కూతురిని వివాహం చేసుకున్నారు.ఈ వివాహం రాజా రెడ్డి చేశారని చెప్తారు. విజయ సాయి రెడ్డి బావ మరిది గడికోట ద్వారకానాథ్ రెడ్డి కూడా 1994లో లక్కిరెడ్డిపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు .

ఈయన సేవలను గుర్తించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి రాగానే విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు. 2006లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా నియమించారు. మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 2006–2010 మధ్య ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌గానూ వ్యవహరించారు.

వైఎస్‌ మరణం తర్వాత..

వైస్సార్ మరణం తరువాత జగన్ తో ప్రయాణించిన విజయసాయి రెడ్డి జగన్ కొన్ని కేసుల్లోసహా నిందుతుడిగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌తోపాటు జైలుకు కూడా వెళ్లారు. కొన్నాళ్లకు తాను బయటికి వచ్చినా.. జగన్‌ను 16 నెలలపాటు జైలులో ఉంచారు. జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని వొచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గకుండా విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ వ్యవహారాలను చాలా జాగ్రత్తగా చక్కబెట్టారు. ప్రతి విషయంలోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటూ వచ్చారు.

ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయింది. 67 స్థానాలు సాధించింది. ఈ స్థానాలకు రాజ్యసభకు పంపడానికి ఒకే అవకాశం ఉండడంతో విద్యావంతుడు అయిన విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారు జగన్‌. అలా 2016లో తొలిసారి విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టారు. ఆ క్షణం నుంచి ఢిల్లీ వ్యవహారాలను చక్కదిద్దుతూ కీలక నేతగా ఎదిగారు. ఆ సమయంలోనే దాదాపు 10 ప్రైవేటు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టి మిగతా సభ్యుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. దక్షిణాది ఎంపీలంటే ఏదో స్వెట్టర్‌ వేసుకొని.. కొన్ని రోజుల ఢిల్లీలో గడిపి రావడమైన అపవాదును విజయసాయిరెడ్డి చెరిపివేశారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళుతూ.. పరిష్కారం కోసం కృషి చేసేవారు. రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్రాన్ని నిలదీస్తూ వచ్చారు. అదే సమయంలో ఏపీ రాజకీయాల్లోనూ ఆయన తనదైన పాత్ర పోషిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని అక్కడ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించి సఫలీకృతమయ్యారు.

2017 అక్టోబర్‌ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేయడానికి పూనుకున్నారు. 2019 జనవరి వరకు పాదయాత్ర కొనసాగింది. ఆసమయంలో పార్టీకి పెద్దదిక్కుగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా నాయకులతో సమావేశాలు జరుపుతూ ఎన్నికల వ్యూహాలను రచించారు. అభ్యర్థులకు ఎదురైన సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళుతూ అందరికీ తలలో నాలుకగా వ్యవహరించారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా 23 మంది ఎంపీలను ముందుండి నడిపిస్తూ విజయసాయిరెడ్డి అందరి మన్ననలు పొందుతున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజ్యసభలో ఆయన చూపిన పనితీరుకు రాజ్యసభ సచివాలయం కూడా ప్రశంసలు అందజేసింది.

విజయసాయి రెడ్డికి మంత్రి పదవి దక్కటం రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగకరంగా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి