iDreamPost

తల్లా పెళ్ళామా ఎవరు గొప్ప – Nostalgia

తల్లా పెళ్ళామా ఎవరు గొప్ప – Nostalgia

మూడు ముళ్ళు వేసిన భర్తను నమ్ముకుని కన్నవాళ్లను వదిలేసి వచ్చిన కొత్త కోడలు ఎవరికైనా తొలిరోజుల్లో ఒకరకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా అత్తగారితో సర్దుకునే విషయంలో వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఒకవేళ ఇద్దరి మధ్య పొసగకపోతే వచ్చే నరకానికి బలయ్యేది మాత్రం మధ్యలో ఉండే మగాడే. ఒకవేళ తల్లి మంచిదైనా కట్టుకున్న పెళ్ళాంకు సహృదయం లేకపోతే ఎదురయ్యే పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఈ పాయింట్ ని తీసుకుని రూపొందించిన చిత్రమే తల్లా పెళ్ళామా. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై స్వర్గీయ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన ఈ చిత్రం 1970లో వచ్చింది.

చిన్న పల్లెటూరిలో ఉండే రవణమ్మ(శాంతకుమారి)ని వదిలేసి పెద్ద కొడుకు(నాగభూషణం)పట్నంలో కాపురం పెట్టి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ డాబుల కోసం అప్పులు చేస్తూ ఉంటాడు. తల్లి దగ్గరే ఉన్న చిన్న కొడుకు సుధాకర్(ఎన్టీఆర్)చనిపోయిన తండ్రి చివరి కోరిక మేరకు బిఏ చదివి పాస్ అవుతాడు. కానీ ఉద్యోగం రాదు. ఈలోగా ప్రేమించిన అమ్మాయి పద్మ(చంద్రకళ)కోట్ల ఆస్తిని వదులుకుని సుధాకర్ కోసం వస్తుంది. చప్పుడు మాటలు విని అత్తను బాధ పెడుతుంది. భార్యకు బుద్ధిచెప్పడం కోసం సుధాకర్ ఇల్లరికం వెళ్తాడు. ఈలోగా కథ రకరకాల మలుపులు తిరిగి అందరికి కనువిప్పు కలిగే సమయానికి రవణమ్మ మనవడి(మాస్టర్ హరికృష్ణ) చేతిలోకన్ను మూస్తుంది

ఈ సినిమా విడుదల సమయంలో రాష్ట్ర విభజన ఉద్యమం ఉదృతంగా ఉంది . ఇందులో తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటూ సినారే రాసిన పాట సంచలనం రేపింది. దీని కారణంగానే హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ లేట్ అయ్యింది. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫుల్ లెన్త్ రోల్ దక్కింది. హీరో లేకుండా కేవలం ఇతని మీదే అరగంటపైగా సినిమ నడుస్తుంది. మ్యూజికల్ గానూ తల్లా పెళ్ళామా మంచి హిట్. హిందీలో పూర్తి కలర్ లో నిర్మాత ఎల్వి ప్రసాద్ బీదాయి పేరుతో రీమేక్ చేస్తే అక్కడా ఘన విజయం అందుకుంది. ఎన్టీఆర్ కు ఈ సినిమా కథా రచయితగా నంది అవార్డు సాధించింది. ఈ సినిమా చూశాక ఎందరో కోడళ్లలో మార్పు వచ్చిందని అప్పట్లో మాట్లాడుకొనేవారు.సెంటిమెంట్ ఆ స్థాయిలో పండింది

Also Read: తెలుగు తెరపై ఫెయిలైన మలయాళం ఫ్రెండ్స్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి