iDreamPost

Happy Birthday Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. అభిమాని ఓపెన్ లెటర్ వైరల్!

Happy Birthday Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. అభిమాని ఓపెన్ లెటర్ వైరల్!

(పదేళ్ల ప్రాయం నుంచే చిరంజీవికి అభిమానిగా మారిన ఓ ఫ్యాన్ మనోగతానికి అక్షరరూపం)

మా అమ్మ అంటూ ఉండేది
“ఏంట్రా ఈ సినిమా పిచ్చి. తిండి పెడతాయా, ఉద్యోగాలిస్తాయా. అయినా ఆ హీరో అంటే అంత వెర్రి అయితే ఎలారా. ఇట్టా మీ కుర్రాళ్ళంతా హీరోల వెంటపడతారు కాబట్టే భవిష్యత్తులో ఏమవుతారో అని భయంగా ఉంది. ఎప్పుడు మారతారో ఎంటో”

నా మనసులో నాకు మాత్రమే వినిపించేది

“అమ్మా, నువ్వు నా మీద ప్రేమతో తిట్టే ఆ హీరో నన్నెప్పుడు నీ భవిష్యత్తు పణంగా పెట్టి అభిమానించు అని చెప్పలేదు. ఆ మాట కొస్తే నీ పెంపకంలో నేను దారి తప్పుతానని ఎలా అనుకుంటావ్. అభిమానం ఆ హీరోకైతే జీవితం నీకేగా”

నేను టీనేజ్ లో అడుగు పెట్టినప్పటి నుంచి చిరంజీవి సినిమా విడుదలైన ప్రతిసారి నాకు ఈ ఆత్మీయ సంఘర్షణ తప్పేది కాదు. ఎలా మొదలైందో ఎవరు నేర్పించారో నాకు గుర్తులేదు. కాని ఆయనంటే క్రేజ్ 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు యముడికి మొగుడు సినిమా నుంచి మొదలైతే జగదేకవీరుడు అతిలోకసుందరితో పీక్స్ కు వెళ్ళిపోయింది. అది మొదలు కొండవీటి దొంగ, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడి అల్లుడు లాంటి సినిమాలు చూసి చూసి కంటికి సైట్ వచ్చిందే కాని చిరు సినిమాలో ట్రీట్ మాత్రం నాకు ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేది. ఆఖరికి అట్టర్ ఫ్లాప్ అని యాంటీ ఫ్యాన్స్ ఊరంతా ప్రచారం చేసిన(వాళ్ళు చెప్పింది నిజమే) స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాని కూడా విసిఆర్ లో వీడియో క్యాసెట్ అరిగిపోయేదాకా ఎన్నిసార్లు చూసానో లెక్క లేదు. అభిమానం కళ్ళల్లో నిండినప్పుడు నిజాలు కూడా అనుమానంగానే అనిపిస్తాయి.

నేను ఒక్కడినే కాదు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ చిరు ఫ్యాన్స్ కావడమే మాకందరికి ప్రెస్టీజ్ లాగా అనిపించేది. ఆపద్బాంధవుడు సినిమా చూసి వచ్చాక బయట అందరూ బాలేదని తిట్టి పోస్తుంటే అదేదో నన్నే అన్న ఫీలింగ్ వల్ల మనస్థాపంతో కొన్ని రోజులు అన్నం సహించకపోవడం నాకు ఇంకా గుర్తే. బిగ్ బాస్ కలెక్షన్స్ తగ్గాయని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ థియేటర్ ఉన్న ఏరియాకు ఎంత కొంపలు మునిగే పని ఉన్నా వెళ్ళేవాడిని కాదు. నా క్లోజ్ ఫ్రెండ్ ఇల్లు అక్కడే ఉన్నా సినిమా ఆడిన 25 రోజులు(అంతకుమించి ఆడలేదు)ఆ ఛాయలకు పోలేదు. చిరంజీవి ఫోటోలు ఉన్న గ్రీటింగ్ కార్డులు, లేబుల్స్, పోస్టర్స్, సినిమా మ్యాగజైన్స్ ఎన్ని కొన్నానో ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చేవో ఓ కోటి రూపాయలు ఇచ్చి చెప్పమన్నా విక్రమార్కుడు కూడా చెప్పలేడు. సెకండ్ రిలీజ్ లో కూడా పసివాడి ప్రాణం, ఖైదీ నెంబర్ 786, కొండవీతో రాజా, రాక్షసుడు, విజేత లాంటి సినిమాలు హౌస్ ఫుల్ తో నడుస్తుంటే ఫుడ్ లేకుండా కడుపు నిండిన ఫీలింగ్. ఇది మాటల్లో వర్ణించేది కాదు.

అసలు చిరంజీవిని ఎందుకు ఇష్టపడ్డావ్ అంటే నేను చెప్పే కారణాల కోసం బుక్కే రాయాల్సి వస్తుంది. అకేషన్ కాబట్టి సముద్రాన్ని చిన్న ఆర్టికల్ లో వర్ణించే ప్రయత్నం చేసాను. ఎందరో అభిమానులు పుస్తకాలు రాసారు, పూనకాలు పోయారు,సంఘాలు పెట్టారు, రక్తదానాలు చేశారు ఎన్నో ఎన్నెన్నో. నేను దేనిలోను లేను. నాది మౌనాభిమానం. ఇంత అభిమానించినా ఖైదీ నెంబర్ 150,సైరా టికెట్ల కోసం ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబెర్ కి కనీసం ఫోన్ చేసేంత నెట్వర్క్ కూడా నాకు లేదు. ఏం చేద్దాం. నాకు మౌనారాధనే ఇష్టం. స్టేట్ రౌడి, రుద్రనేత్ర, త్రినేత్రుడు సినిమాల్లో స్టెప్స్ చూసి సంవత్సరాల కొద్దీ ఒంటరిగా రూంలోనే ప్రాక్టీస్ చేయటం నాకు, మేము మారిన ఇళ్లల్లో గోడలకు మాత్రమే తెలిసిన రహస్యం. అల్మారా మొత్తం ఆడియో కేసెట్లతో నిండిపోతే తన సంపాదనలో సగం ఇలా ఈ రూపంలో చిరంజీవే లాగేసుకుంటున్నాడని నాన్న ఎన్నిసార్లు అన్నారో లెక్కబెట్టడం కష్టం.

ఇక స్కూల్ వయసు మొదలుకొని కాలేజ్ దాకా టీచర్లతో కూడా ఇదే విషయం గురించి తిట్లు తినడం కూడా తీయగానే ఉండేది. చిరు సినిమాల్లో కనిపించే షర్టుల కోసం బజార్ లో షాపులు మొత్తం వెతికిన జ్ఞాపకాలు కోకొల్లలు. థియేటర్ బయట పెట్టే కట్ ఔట్ చూడడానికి సైకిల్ వేసుకుని ఎన్ని రౌండ్స్ వేశామో తలుచుకుంటే ఇప్పటికీ తీయగా అనిపిస్తుంది.

చిరు అనే సమ్మోహన శక్తి గురించి చెప్పుకుంటూ పోతే వచ్చే ఏడాది బర్త్ డే కూడా రావొచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎందరో పంచుకున్నారు. నేనే ఆఖరు అనుకుంటా. ఇది చిరుతో అనుబంధం గురించి నేను బుక్ లాంటి ప్రయత్నం చేస్తే అందులో ఓ రెండు పేజీలు మాత్రమే ఇక్కడ మీ ముందు ఉంచాను. ఇది నా ఒక్కడిదే కాదు అందరి అభిమానుల కథ.

మొదట్లో అమ్మ దేని గురించి అయితే దిగులు పడిందో ఈ రోజు అదే సినిమా నా మనుగడకు ఒక కారణమైంది. నా ఉద్యోగ ప్రస్థానంలో ఒక మజిలీగా మారింది. కారణం ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

గత అక్టోబర్లో అమ్మానాన్నతో కలిసి ఫ్యామిలీ మొత్తం సైరా చూసి బయటకు వస్తుండగా అమ్మ అంది

“ఏంట్రా ఇది. మీరు మారారు, లైఫ్ లో సెటిల్ అయ్యారు, స్వంతంగా ఫ్యామిలీ వచ్చి చేరింది, బాధ్యతలు పెరిగాయి. కానీ మీ హీరో మాత్రం అలాగే ఎలా ఉన్నాడురా. అప్పటి లాగే ఇంత ఈజ్ తో ఆ డాన్సులు ఎలా చేసాడ్రా. మొహంలో వర్చసుతో మాయ చేయటం ఆయనకు సాధ్యమైనట్టు ఇంకెవరికి కాదు. గొప్పోడురా బాబు”

ఇప్పుడు కూడా మనసులోనే అనుకున్నా”ఆయన మారడు, మా అభిమానం మారదు. ఇది ఇంతే”

ఎందుకంటే మెగాస్టార్ అనేది బిరుదు కాదు ఒక ఎమోషన్…..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి