iDreamPost
android-app
ios-app

ఏంటి మోసం అంటున్నాడు.. యూట్యూబ్ లో 30 లక్షల సంపాదన నిజం కాదా?

ఏంటి మోసం అంటున్నాడు.. యూట్యూబ్ లో 30 లక్షల సంపాదన నిజం కాదా?

అవినాష్ అనే పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు.. కానీ, నా అన్వేషణ యూట్యూబర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ గుర్తు పడతారు. ఒక తెలుగు వాడు యూట్యూబర్ ప్రపంచాన్ని చుట్టటమే కాకుండా.. మనం చూడలేని ఎన్నో దేశాలను, అక్కడి అద్భుతాలను చూపిస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ఇతనికి ఎంత క్రేజ్ వచ్చింది అంటే.. యూట్యూబ్ నుంచి ఒక నెలకు ఏకంగా రూ.30 లక్షలు తీసుకున్నాడు. ఆ విషయాన్ని సాక్షాలతో సహా వీడియో కూడా చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. దాంతో కొత్త కొత్త కోర్సులు కూడా పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిపై అవినాష్ స్పందించాడు. రూ.30 లక్షలు సంపాదన వెనుకున్న అసలు నిజాన్ని వెల్లడించాడు.

నా అన్వేషణ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవినాష్ కేవలం ప్రదేశాలు చూపించడం, అక్కడి ప్రత్యేకతలు చెప్పడం మాత్రమే కాకుండా.. యువతను మోటివేట్ కూడా చేస్తుంటాడు. ఇలా మాట్లాడితే లైకులు కొట్టరేమో.. వ్యూస్ రావేమో అని భయపడకుండా ఉన్న విషయాన్ని.. తాను అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తాడు. అయితే ఇలా ఒక నెలకు రూ.30 లక్షలు వచ్చాయి అనగానే చాలా మంది ఫోన్లు, కెమెరాలు పట్టుకుని యూట్యూబర్ ని అయిపోతా అంటూ బయల్దేరారు. అంతేకాకుండా నా అన్వేషణ అవినాష్ లా నెలకి రూ.30 లక్షలు సంపాదించాలంటే ఈ కోర్సు చేయండి అంటూ అమ్మకాలు కూడా మొదలు పెట్టారు. అయితే ఆ కోర్సులపై నేరుగా అవినాష్ స్పందించాడు. తనదైనశైలిలో అలాంటి వారికి కాస్త గట్టిగానే ఇచ్చిపడేశాడు. అవన్నీ బొత్తి అబద్ధాలని అస్సలు నమ్మద్దంటూ హెచ్చరించాడు.

“నెలకు నేను 30 లక్షలు సంపాదించాను అంటే.. దాని వెనుక నా నాలుగేళ్ల కష్టం దాగుంది. ఏదో ఒక్కసారిగా నాకు రూ.30 లక్షలు రాలేదు. ఇప్పుడు ఏంటో కొత్తగా నెలకు రూ.30 లక్షలు రావాలంటే ఈ కోర్సులు చేయండి అంటూ చెబుతున్నారు. నిజానికి యూట్యూబర్ కావాలి అంటే ఫోన్ ఉంటే చాలు. మీరు ఎలాంటి కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. నా మొదటి వీడియోకి కేవలం 10 డాలర్లు మాత్రమే వచ్చాయి. ఆ స్థాయి నుంచి ఇప్పుడు నెలకు రూ.30 లక్షలు తీసుకునే దాకా వచ్చాను. ఇంత వరకు రావడానికి నేను నా కుటుంబాన్ని వదిలేసి దేశాలు పట్టుకుని తిరుగుతున్నాను. సెలవు కూడా తీసుకోకుండా నేను పని చేస్తున్నాను. ప్రాణాలకు తెగించి ఎన్నో సాహసాలు చేశాను. మీకు ఏదైనా ఇష్టం ఉంటే అది చేసుకోండి. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. నేను చదివిన చదువుకు తగ్గట్లు ఈ ట్రావెలింగ్ చేస్తున్నాను. నేను ట్రావెలింగ్ టూరిజంలో పీజీ చేశాను. బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను.

అందుకే టెక్నికల్ గా కూడా నాకు గ్రిప్ ఎక్కువ. అంతేకానీ నన్ను చూసి మీరు గొర్రెల్లాగా తయారు కాకండి. నేను చదువుకున్న దానికి తగ్గట్లుగా చేస్తున్నాను కాబట్టే ఇంకా కొనసాగిస్తున్నాను. మీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు దేశాలు పట్టుకుని బయల్దేరకండి.. ఎందుకూ పనికిరాకుండా పోతారు. ఇక్కడ ఆదాయం మాత్రమే కాదు.. నష్టం కూడా ఉంటుంది. ఫిఫా వరల్డ్ కప్ కి నేను రూ.3 లక్షలు ఖర్చు చేస్తే కేవలం రూ.60 వేలు మాత్రమే వచ్చాయి. మీ జీవన శైలి కూడా మారిపోతుంది. నేను వెజిటేరియన్ ని.. కానీ, వీడియోల కోసం తేళ్లు, పాములు, కప్పలు, పురుగులు కూడా తిన్నాను. యూట్యూబర్ అంటూ బయల్దేరకండి.. అక్కడ ఉండే కష్టనష్టాలు తెలుసుకోండి. ముందు పార్ట్ టైమ్ గా స్టార్ట్ చేయండి. మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే తర్వాత చూడచ్చు” అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు.