కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం అని ఊరికే అనలేదు. ఈ సృష్టిలో అన్నింటికన్నా విలువైంది ఏదైనా ఉంది అంటే.. అది ప్రాణమే. అదే పోయిన తర్వాత ఎన్ని ఆస్తులు, ఆర్భాటాలు ఉన్నా ఉపయోగం ఉండదు. అయితే చాలా మంది ఆ ప్రాణానికి అసలు విలువే లేదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. చాలా చిన్న విషయాలకే ఎదుటి వారిపై దాడికి దిగి వారి మరణానికి కారణం అవుతుంటారు. అలాంటి ఒక అమానుష ఘటన గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కేవలం రూ.50 కోసం ఒక వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టి.. అతని ప్రాణాలు పోయేలా చేశారు.
ఈ అమానవీయ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోజ్ పూర్ సమీపంలోని కుల్హారియా టోల్ ప్లాజాలో 35 ఏళ్ల బల్వంత్ సింగ్ పని చేసేవాడు. అతను రూ.50 దొంగిలించాడు అనే ఆరోపణలతో అతని సహోద్యోగులు, బౌన్సర్లు అతనిపై దాడికి దిగారు. అతను చలనం లేకుండా పడిపోవడంతో వెంటనే.. ఉత్తరప్రదేశ్ లోని గోండాకి తరలించారు. అక్కడి వైద్యులు బల్వంత్ సింగ్ ని పరిశీలించి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. బల్వంత్ సింగ్ మృతికి కారణమైన వారికి కఠినంగా శిక్షించాలంటూ కుటుంబీకులు గొండా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
బల్వంత్ సింగ్ ని కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. మేడపైకి తీసుకెళ్లి ఉద్యోగులు, బౌన్సర్లు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. చీపుర్లతో కొట్టడం, పిడిగుద్దులతో ఊపిరాడకుండా చేశారు. అతను వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలినా కూడా వదల్లేదు. అతను అచేతనంగా పడిపోవడంతో భయమేసి వెంటనే రైలు ఎక్కించి గోండాకి తరలించారు. అయితే అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.50 కోసం అతడిని కొట్టి చంపారు.. ఆ రూ.50 ఇస్తే అతని ప్రాణాలను తిరిగి తీసుకొస్తారా? అతని కుటుంబం పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Bouncers beat a toll plaza guard to death on suspicion of stealing Rs 50 in Arrah, Bihar pic.twitter.com/SCG6GQDgax
— The New Indian (@TheNewIndian_in) June 19, 2023