అక్కినేని వారసుడు అఖిల్‌కు యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన లుక్స్, డ్యాన్స్, స్టైల్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ దీనికి తగ్గట్లు ఆయనకు హిట్స్ పడట్లేదు. ఎన్ని చిత్రాలు చేసినా ఒక్కటీ బ్లాక్‌బస్టర్ హిట్ కాలేదు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సరసన నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మాత్రం మంచి విజయాన్ని సాధించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ అఖిల్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ ఫిల్మ్ ఆయన కెరీర్లో అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఐదు నెలలైంది. అయినా ఇంకా ఓటీటీలోకి రాలేదు.
మామూలుగా సినిమాలు విడుదలైన ఆరేడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని హిట్ మూవీస్ అయితే రిలీజైన మూడ్నాలుగు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు రావడం గమనార్హం. కానీ ‘ఏజెంట్’ మాత్రం విడుదలై ఐదు నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఇప్పటికే పలుమార్లు ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవల స్వయంగా మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మరో ట్విస్టు వచ్చింది.
విశాఖపట్నంకు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ‘ఏజెంట్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తనను మోసం చేశారంటూ హైదరాబాద్ సివిల్ కోర్టులో సతీష్ కంప్లయింట్ చేశారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం సెప్టెంబర్ 29న ‘ఏజెంట్’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా స్టే విధించింది. దీంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆశగా ఎదురుచూసిన అఖిల్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: ప్రభాస్ సరసన శ్రీలీల.. కాదనేలక నిజం చెప్పేసిన దర్శకుడు!