రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా వెనక రహస్యం ఏంటీ.. ఆ ధైర్యమే కారణమా?

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్నా కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎవరు ఏ క్షణంలో ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని అయోమయపరిస్థితులు నెలకొంటున్నాయి.

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్నా కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎవరు ఏ క్షణంలో ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని అయోమయపరిస్థితులు నెలకొంటున్నాయి.

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సమయంలో అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. అసంతృప్తి నేతలు ఏ క్షణంలో రాజీనామా చేసి పక్కపార్టీ జెండా కప్పకుంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. కానీ కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన కొనసాగిస్తూ మొదటి లీస్ట్ మాత్రమే విడుదల చేశారు. మొదటి లీస్ట్ లో తమ పేర్లు రానివారు.. ఇక రాదని భావించిన నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రత్యమ్నాయ పార్టీలోకి లేదా అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అయితే ఆయన పార్టీ వీడటానికి ముఖ్య కారణం ఏంటీ.. ఏ ధైర్యంతో ఆయన రాజీనామా చేశారు అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతున్నా కొద్ది రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా వ్యవహరిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ లకు వరుస షాకులు తగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ పార్టీగా చెబుతున్న కాంగ్రెస్ లోకి కొంతమంది కీలక నేతలు వలస వెళ్తున్నారు. గత ఐదేళ్లలో తెలంగాణలో బీజేపీ సైతం ప్రజా పక్షాన పోరాడుతూ.. తన ఉనికి చాటుకుంటూ వస్తుంది. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బండి సంజయ్ ని అధిష్టానం పక్కన బెట్టి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టిందో.. తెలంగాణలో కమలం వాడిపోయిందని అంటున్నారు.  ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత బీజేపీ ఆలస్యంగా మొదటి జాబితా విడుదల చేసింది. అందులో పలువురు ముఖ్యనేతల పేర్లు లేకపోవడం.. ఆశావాహుల పేర్లు ఉంటాయా? ఉండవా? అన్న సందిగ్ధత నెలకొనడంతో ముందుగానే సర్ధుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కి గుడ్ బై చెప్పి సొంతగూటికి వెళ్తున్నట్లుగా ప్రకటించారు.

ఒకప్పుడు నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు మారుమోగింది. బిగ్గెస్ట్ కాంట్రాక్టర్లుగా పేరు తెచ్చుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి వరుస విజయాలు అందుకుంటూ తిరుగులేని పొలిటీషియన్స్ గా ఎదిగారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అన్నదమ్ములు చెరోదారిన నడిచారు. ఈ క్రమంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు రాజగోపాల్ రెడ్డి. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో కొనసాగడం కష్టమని ప్రచారం మొదలైంది. ఎప్పటికప్పుడు అన్నదమ్ములు ఆ విషయాన్ని కొట్టిపడేస్తూ వచ్చారు. కానీ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అందరూ ఊహించినట్టుగానే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. ఆయన పార్టీ వీడటానికి గల కారణాలపై రక రకా ప్రచారం జరుగుతుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి తనకు ఎల్బీ నగర్ నుంచి టికెట్ కావాలని.. తన సతీమణికి మునుగోడు నుంచి టికెట్ కావాలని ప్రతిపాదనలు అధిష్టానికి పంపించినట్లు సమాచారం. కానీ ఇందుకు కమలం పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదని.. నిన్నటి వరకు రెండు ప్రతిపాదనపై ఎలాంటి క్లారిటీ రాకపోవడం.. మొదటి జాబితాలో తన పేరు, తన భార్య పేరు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి వెళ్లాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం కాంగ్రెస్ తో మొదలైంది.. అంతే కాదు ఎవరు అవునన్నా.. కాదన్నా తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందన్న ధైర్యం తనకు ఉందన్న ధీమాతోనే సొంతగూటికి వెళ్లేందుకు నిశ్చయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తన తమ్ముడు ఏ పార్టీలో కొనసాగినా తనకు అభ్యంతరం లేదని.. కాకపోతే ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలని సూచిస్తానని గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని రాజగోపాల్ రెడ్డి రాకతో పార్టీకి మరింత బలం పెరుగుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందని అంటున్నారు. అసలు విషయం రహస్యం ఏంటంటే.. అన్నీ అనుకూలించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నదమ్ములకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.

Show comments