విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు మృతి

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. కాగా సేద తీరేందుకు వీటి చెంతకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదావశాత్తు నీటిలో మునిగి చనిపోయిన ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. సరదా కోసం ఈతకు వెల్లిన వారు సైతం ఈత రాక మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగిపోతున్న బాలుడిని రక్షించే ప్రయత్నంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు తమతో గడిపిన వారు విగతజీవులుగా మారడంతో గుండెలవిసేలా రోదించారు కుటుంబ సభ్యులు, బంధువులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలు చెరువు ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా వారితో వచ్చిన బాలుడు చెరువు ఒడ్డున ఆడుకుంటూ చెరువులోకి దిగి మునిగిపోసాగాడు. అయితే ఇది గమనించిన బాలుడి తల్లి కొడుకును కాపాడుకునేందుకు చెరువులోకి దూకింది. కానీ తనకు ఈత రాదు దీంతో తల్లీ కొడుకు మునిగిపోసాగారు. దీంతో ఆందోళన చెందిన మరో ఇద్దరు మహిళలు వారిని కాపాడేందుకు చెరువులోకి దిగారు. వీరికి కూడా ఈత రాకపోవడంతో చెరువులో మునిగి జలసమాధి అయ్యారు.

కాగా బట్టలు ఉతకడానికని వెల్లిన వారు ఇంకా రాలేదని అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు వారిని వెతుక్కుంటూ చెరువు వద్దకు వెళ్లారు. కానీ అక్కడ వారి చెప్పులు, బట్టలు మాత్రమే కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించారు. నలుగురి మృతదేహాలను చెరువునుంచి బయటకు తీశారు. కాగా రంగాయపల్లిలో బోనాల పండుగ జరుపుకుంటున్న సందర్బంగా సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం అంబర్ పేట్ గ్రామానికి చెందిన దొడ్డు బాలమణి(30), తన కుమారుడు దొడ్డు చరణ్ (10), తన తోటికోడలు దొడ్డు లక్ష్మి (25) తో కలిసి బంధువుల ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఇలా పండుగ జరుపుకునేందుకు వచ్చి చెరువులో పడి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show comments