iDreamPost

CM Revanth Reddy: KCRకు సీఎం రేవంత్ ప్రత్యేక ఆహ్వానం.. దేని కోసమంటే

  • Published May 31, 2024 | 9:36 AMUpdated May 31, 2024 | 9:36 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఇంతకు దేని కోసం ఈ ఆహ్వానం అంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఇంతకు దేని కోసం ఈ ఆహ్వానం అంటే..

  • Published May 31, 2024 | 9:36 AMUpdated May 31, 2024 | 9:36 AM
CM Revanth Reddy: KCRకు సీఎం రేవంత్ ప్రత్యేక ఆహ్వానం.. దేని కోసమంటే

తెలంగాణ రాజకీయాలను బాగా పరిశీలించే వారికి.. కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలపరంగా చూస్తే.. ఈ ఇద్దరు నాయకుల మధ్య బద్ద రాజకీయ వైరం కనిపిస్తుంది. పార్టీలపరంగా ఇరువురి మధ్య బద్ద శత్రుత్వం కనిపిస్తుంటుంది. సమయం, సందర్భం వచ్చిన ప్రతి సారి మాజీ సీఎం కేసీఆర్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. ఈ విషయంలో ఇద్దరూ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తారు.. ఢీ అంటే ఢీ అన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. అయితే ఇది పార్టీ సిద్ధాంతాలపరంగా మాత్రమే. అదే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వస్తే.. అందరూ కలిసి పోతారు. తాజాగా ఇలాంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఆ వివరాలు..

ఈ ఏడాదితో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్నాయి. తెలంగాణలో జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులోనూ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్కార్‌ ప్రణాళికలు రెడీ చేస్తోంది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోన్న రేవంత్‌ సర్కార్‌.. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అలానే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అదే రోజున అనగా జూన్‌ 2 రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ పాటను ప్రకటించేందుకు సర్కార్‌ రెడీ అయ్యిది. ఇందుకోసం ఈ పాటను సరికొత్తగా స్వరపరిచింది. ఇక సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి.

అయితే.. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొవాల్సిందిగా.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ రాశారు. అంతేకాక కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి వేడుకలకు హాజరు కావాల్సిందిగా.. ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్‌కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సంబురాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం.. ట్యాంక్ బండ్‌పై ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు, వస్తువుల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనుంది. మరి కేసీఆర్‌.. ఈ వేడుకలకు హాజరవుతారా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి