తెలంగాణలో రాబోయే రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ ఆల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్రం అధికారులు అన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. నేడు, రేపు మంచిర్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయన్నారు. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో సోమవారం కుండపోత వర్షం కురిసింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉన్నట్లుండి మేఘాటు కమ్ముకొని కారు చీకట్లు అలుముకున్నాయి. ఆ తర్వాత వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ కుండపోత వాన కురిపించాడు. భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాదాపూర్, బేగంపేట్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహిదీపట్నం, లక్డీకాపూల్, అమీర్ పేట్, బేగం బజార్, చార్మినార్, రాణిగంజ్, కూకట్పల్లి, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల లాంటి చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
భారీ వానలతో రోడ్ల మీదకు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం కూడా హైదరాబాద్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైందని అధికారులు చెప్పారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ఈ రుతుపవనాల తిరోగమనం రాజస్థాన్ నుంచి ప్రారంభమైందన్నారు. ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి ఒక వారం ఆలస్యంగా మొదలైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ఆగమనం కూడా వారం రోజులు ఆలస్యంగా మొదలైందని గుర్తుచేశారు.