బ్రేకింగ్: రెండ్రోజులు అన్ని ఆఫీసులకు సెలవులు.. వీటికి మాత్రమే మినహాయింపు!

  • Author singhj Updated - 09:21 PM, Thu - 20 July 23
  • Author singhj Updated - 09:21 PM, Thu - 20 July 23
బ్రేకింగ్: రెండ్రోజులు అన్ని ఆఫీసులకు సెలవులు.. వీటికి మాత్రమే మినహాయింపు!

ఉభయ తెలుగు రాష్ట్రాలను వాన ముసురు వీడటం లేదు. ముఖ్యంగా తెలంగాణలో గత మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ సహా ముఖ్య పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం, శనివారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో జీహెచ్​ఎంసీ పరిధిలో ఉన్న అన్ని రకాల విద్యా సంస్థలు సహా ప్రభుత్వ కార్యాలయాలు రేపు, ఎల్లుండి వరకు తెరిచేందుకు వీల్లేదు. అలాగే ప్రైవేటు స్కూల్స్, సంస్థలు కూడా వారి ఆఫీసులకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సర్కారు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం.

ఈ రెండ్రోజులు అన్ని రకాల ఆఫీసులు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. కొన్నింటికి మాత్రం మినహాయింపును ఇచ్చింది. వైద్యం, పాల సరఫరా తదితర ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక, గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఆమె ట్వీట్ చేసేలోపే స్కూళ్లు ప్రారంభం కావడంతో సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. స్టూడెంట్స్ అందరూ స్కూళ్లకు వెళ్లాక.. సెలవులు ప్రకటించడం ఏంటని పేరెంట్స్​తో పాటు సామాన్య ప్రజానీకం నుంచి కూడా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం.. ఇది రిపీట్ కాకుండా ఉండేందుకు ముందుగానే ఆ సెలవులను పొడిగిస్తున్నట్లు తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

Show comments