iDreamPost
android-app
ios-app

పేద రోగులకు సర్కారు గుడ్ న్యూస్.. మారుమూల పల్లెల నుంచి పట్నానికి..!

  • Author singhj Published - 01:35 PM, Tue - 26 September 23
  • Author singhj Published - 01:35 PM, Tue - 26 September 23
పేద రోగులకు సర్కారు గుడ్ న్యూస్.. మారుమూల పల్లెల నుంచి పట్నానికి..!

వైద్య రంగంపై ఇప్పుడు ఫోకస్ పెరుగుతోంది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడాల్లేకుండా చాలా రాష్ట్రాలు ఇప్పుడు దీనిపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు కూడా వైద్య రంగానికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ లాంటి పనులు చేపట్టారు. అలాగే ఉచితంగా డయాలసిస్ సేవలు, వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని పేద రోగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో త్వరలోనే ఉచిత ఎయిర్ అంబులెన్స్​లను ప్రారంభించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పదేళ్ల పగ్రతి నివేదికను హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మారుమూల పేద ప్రజలకు కీలకమైన అత్యవసర వైద్యసేవలు ఫ్రీగా అందించేందుకు నిమ్స్ కేంద్రంగా త్వరలో ఎయిర్ అంబులెన్స్ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ములుగు లాంటి మారుమూల ప్రాంతంలో అత్యవసరమైతే రోగిని హెలికాప్టర్​లో హైదరాబాద్​కు తరలించి ట్రీట్​మెంట్ అందిస్తామన్నారు. ఎమర్జెన్సీ టైమ్​లో ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా రోగుల ప్రాణాలను రక్షించడంలో ఎయిర్ అంబులెన్స్​లు సాయపడతాయని మంత్రి హరీష్​రావు చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వైద్యారోగ్య శాఖ కొత్త చరిత్రను సృష్టిస్తోందని హరీష్​రావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల పనితీరు ఎంతో మెరుగైందని చెప్పారు. నీతిఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ 11 నుంచి మూడో స్థానానికి చేరుకుందని.. ఫస్ట్ ప్లేసుకు చేరుకోవడమే టార్గెట్ అని హరీష్ రావు పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, ప్రతి మండలానికో పీహెచ్​సీ, నియోజకవర్గానికో 100 పడకల ఆస్పత్రి, జిల్లాకో వైద్య కళాశాల, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ సహా వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్​కు నలువైపులా నాలుగు టిమ్స్ ఆస్పత్రుల ద్వారా 50 వేల పడకలు, 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఆస్పత్రుల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హరీష్ రావు వివరించారు. అవయవ మార్పిడిలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందన్నారు.