అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎలక్షన్స్‌లో ఎలాగైనా గెలవాలనే కసిలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలు అందుకు తగ్గట్లు వ్యూహాలను రచిస్తూ బిజీబిజీగా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీల అధిష్టానాలు తలమునకలై ఉన్నాయి. అయితే ఎవరి అంచనాలకూ అందని రీతిలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే ఆయన తమ పార్టీ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఎవరు పోటీచేయనున్నారో చెప్పేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ ఆయన విడుదల చేశారు.
బీఆర్ఎస్ తాజాగా విడుదల చేసిన శాసనసభ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాలో కొంతమంది సిట్టింగ్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిచేయి చూపించారు. అందులో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు మరికొందరు ప్రముఖ నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్లు రానంత మాత్రాన నాయకులు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. అనవసర హడావుడి చేసి ఫ్యూచర్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు కేసీఆర్. బీఆర్ఎస్ ఒక సముద్రం లాంటిదని.. అందరికీ పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయని చెప్పారు.
టికెట్ రాని సిట్టింగ్ నేతలు కూడా పార్టీలోనే ఉండాలన్నారు కేసీఆర్. పొలిటికల్ లైఫ్ అంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ.. ఇలా చాలా ఛాన్సులు ఉంటాయన్నారు. చాలా మంది నేతలు జిల్లా పరిషత్ ఛైర్మన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నారు బీఆర్ఎస్ అధినేత. గతంలోనూ తాము ఇలాగే చేశామని.. ఈ ఎలక్షన్స్‌లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉతన్న శిఖరాలకు తీసుకెళ్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎలక్షన్స్ అంటే మిగిలిన పార్టీలకు పొలిటికల్ గేమ్ అని.. కానీ బీఆర్ఎస్కు మాత్రం ఒక టాస్క్ అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలను పవిత్ర యుద్ధంలా ముందుకు తీసుకెళ్తామన్నారు కేసీఆర్.