నానమ్మ కల నెరవేర్చిన మంత్రి KTR.. అందుకోసం ఏకంగా రూ.2.5 కోట్లతో!

మంత్రి కేటీఆర్‌ రాజకీయాల్లో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందర్భం వచ్చిన ప్రతి సారి ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ.. విపక్షాల మీద వాడివేడి విమర్శలు చేస్తూ.. దూకుడుగా ముందుకు వెళ్తుంటారు. ఇక రాజకీయాల్లో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో.. సోషల్‌ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించడమే కాక.. సమాజంలో స్ఫూర్తి నింపే అంశాలపై కూడా స్పందిస్తూంటారు. ఇక తాజాగా కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు నిజమైన వారసుడు అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకు కేటీఆర్‌ ఏం చేశారంటే..

తన నానమ్మ కల నెరవేర్చారు కేటీఆర్‌. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం.. నానమ్మ సొంత ఊరిలో తన సొంత నిధులతో.. ఇంద్ర భవనాన్ని తలదన్నే రీతిలో స్కూల్‌ బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేశారు కేటీఆర్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేయడంతో.. అవి నెట్టింట వైరలవుతున్నాయి. మంత్రి కేటిఆర్ నానమ్మ వెంక‌ట‌మ్మ సొంతూరు బీబీపేట మండ‌లం కోనాపూర్. కాగా గ‌త ఏడాది మే 10 వ తేదీన కామారెడ్డి జిల్లా కోనాపూర్‌లో ప‌ర్యటించిన మంత్రి కేటీఆర్.. నానమ్మ స్వగ్రామంలో తన సొంత నిధులతో పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి భవన నిర్మాణ పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ స్కూల్‌ బిల్డింగ్‌ నిర్మాణం కోసం కేటీఆర్‌ ఏకంగా 2.5 కోట్ల రూపాయల సొంత నిధులను ఖర్చు చేశారు.

నానమ్మ స్వగ్రామంలో రెండు కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి.. అత్యాధునిక హంగులతో పాఠశాల భవనం నిర్మించారు. దీంతో పాటుగా గ్రామంలో రూ.10 కోట్లతో ప‌లు అభివృద్ది ప‌నులను సైతం ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌. గ్రామానికి వెళ్లే దారిలో రూ.2.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. మరో 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేశారు. అలాగే 25 ల‌క్షల రూపాయలతో గ్రామ పంచాయితీ నిర్మాణం చేప‌ట్టారు. మ‌రో 5 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధి కింద గ్రామానికి మంజారు చేశారు.. వీటితో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కూడా నిర్మించారు. అంతేకాక గ్రామంలో కుల సంఘాల భవనాలు, పలు ఆలయాల నిర్మాణాలు కూడా చేపట్టారు.

అయితే.. తాజాగా పాఠశాల భవనానికి సంబంధించి కేటీఆర్‌.. నిర్మాణం పూర్తయిన స్కూల్‌ బిల్డింగ్ ఫొటో, వీడియోను తన ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. త్వర‌లోనే కోనాపూర్‌కు వ‌చ్చి నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. దీంతో గ్రామ‌స్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భవనాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌.. తన తల్లి శోభతో కలిసి విచ్చేయనున్నట్లు సమాచారం. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show comments