iDreamPost
android-app
ios-app

వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు రూ.3 వేలు నేరుగా అకౌంట్లలోకి: KTR

వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు రూ.3 వేలు నేరుగా అకౌంట్లలోకి: KTR

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ లోని శిల్పారామంలో 500 గజాల స్థలంలో నిర్మిస్తున్న చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తర్వాత మన్నెగూడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం 2023 వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ చేనేత కార్మికులపై వరాల జల్లు కురిపించారు. చేనేత కార్మికులకు అందజేసే హెల్త్ కార్డుల పరిమితిని రూ.25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొత్తగా కొన్ని వ్యాధులను కూడా చేర్చినట్లు చెప్పారు. అలాగే వారికి ఇంకొక శుభవార్తను కూడా చెప్పారు.

చేనేత కార్మికుల బాధలు ఎలా ఉంటాయో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం కూడా ఒక పద్మశాలి కుటుంబంలో ఉండే చదువుకున్నారనే విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగానే కేటీఆర్ చేనేత కార్మికులకు ఒక శుభవార్తను తెలియజేశారు. చేనేత మిత్ర పథకంలో వృత్తిలో ఉన్న చేనేత కార్మికులకు వచ్చే నెల నుంచే నెలకు రూ.3 వేలు చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న విషయాన్ని ప్రకటించారు. రూ.40.50 కోట్లు ప్రైమ్‌ మగ్గాలు ఏర్పాటు కోసం అందిస్తున్నామని కేటీఆర్ తెలియజేశారు. ఒక్కో మగ్గానికి రూ.38 వేల చొప్పున అందజేస్తున్న విషయాన్ని తెలియజేశారు.

చేనేత కార్మికుల కోసం గృహలక్ష్మి పథకం తీసుకొస్తున్న విషయాన్ని వెల్లడించారు. పని కోసం సూరత్ వెళ్లిన వాళ్లు.. ప్రభుత్వ సహకారంతో పనులు ఇచ్చే వారిగా తిరిగొచ్చారని కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికులకు ఐడీ కార్డులు.. టెస్కో ద్వారా వీవర్స్ మెంబర్స్‌ కు పరిహారం రూ.25 వేలకు పెంచామన్నారు. చేనేతపై కేంద్రం వసూలు చేస్తున్న 5 శాతం జీఎస్టీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత వద్దు.. పథకాలు అన్నీ రద్దు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం తీరు ఉందంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని నాయకులకు నేత అంటే తెలీదు.. నేతన్నల కష్టాలు తెలియవంటూ కేటీఆర్ విమర్శించారు. ఉప్పల్ బాగాయత్‌లో హ్యాండ్లుమ్ మ్యూజియం ఏర్పాటు కోసం ఇప్పటికే శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని కేటీఆర్ వెల్లడించారు. పోచంపల్లి హ్యాండ్లుమ్ పార్కును రూ.12.60 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.