iDreamPost

ఇదెక్కడి మోసం బ్రో.. ఎవరిదో ఇల్లు చూపించి 2.5 కోట్లు కొట్టేశాడు!

ఇదెక్కడి మోసం బ్రో.. ఎవరిదో ఇల్లు చూపించి 2.5 కోట్లు కొట్టేశాడు!

సాధారణంగా ఇప్పుడు కష్టపడి, ఒళ్లొంచి పని చేసే వాళ్లకంటే ఊరికే మాటలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్లు ఎక్కువైపోయారు. వాళ్లకి పని చేయడం రాదు.. చేయాలని ఉండదు. పొద్దున లేచిన దగ్గరి నుంచి ఎవడి నెత్తిన చేయి పెడదాం.. ఎవరిని మోసం చేద్దాం అనే చూస్తుంటారు. జనాలు కూడా అలాంటి వాళ్లు చెప్పే మాటలకు ఇట్టే బుట్టలో పడిపోయి డబ్బంతా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ఒక మోసం ఒకటి వెలుగు చూసింది. ఇక్కడ ఏకంగా రూ.2.40 కోట్లు కొట్టేసి ఉడాయించాడు.

హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ లో నివాసముండే జమ్ముల సునీల కుమార్ కు కొన్నాళ్ల క్రితం వెంకటేశ్ ధనరాజ్ తో పరిచయం ఏర్పడింది. వాళ్లు చాలా తక్కువ సమయంలోనే బాగా క్లోజ్ అయిపోయారు. సునీల్ కుమార్ తో వెంకటేశ్ ధనరాజ్ తన ఫ్యామిలీ విషయాలు కూడా చెబుతూ ఉంటాడు. అలాగే తమకు తార్నాకలో 400 గజాల స్థలం ఉందని చెప్పాడు. తన సోదరుడు ప్రసాద్ తో కలిసి బ్యాంక్ లోను తీసుకుని ఇల్లు కడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత డబ్బులు సెట్ కావడంలేదని ఆ ఇంటి నిర్మాణం ఆపేసినట్లు తెలిపాడు. అయితే ఆ ఇంటిని రూ.2.60 కోట్లకు విక్రయిస్తానని సునీల్ కుమార్ కు చెప్పాడు. అక్కడితో ఆగకుండా సునీల్ కుమార్ ను తీసుకెళ్లి రోడ్డు మీదున్న ఏదో రెండస్తుల భవనాన్ని చూపించాడు.

ఇదే మా ఇల్లు దీన్నే అమ్మాలి అనుకుంటుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్ కుమార్ కు ఇల్లు బాగా నచ్చడంతో తానే కొనుగోలు చేస్తానని తెలిపాడు. ముందుగా రూ.2.40 కోట్లు అప్పజెప్పాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన రూ.20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రాపర్టీ పేపర్లు తీసుకురామన్నా.. రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నా కూడా వెంకటేశ్ ముఖం చాటేయడం మొదలు పెట్టాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఏదొక సాకు చెప్పడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు సునీల్ కుమార్ కు అసలు విషయం బోధ పడింది. తాను మోసపోయిన విషయాన్ని గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి తాను మోసపోయిన తీరును వివరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

ఈ మొత్తం ఘటన తెలుసుకున్న నెటిజన్స్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమ్మో ఒకటో తారీఖు సినిమా సీన్ ని గుర్తు చేసుకుంటున్నారు. తనికెళ్ల భరణి బ్రహ్మానందానికి చార్మినార్, రవీంద్ర భారతి, బిర్లా మందిర్ ఇలా అన్నీ అమ్మేస్తానంటూ మోసం చేస్తాడు. అందరి దగ్గర డబ్బు గుంజేసుకుని అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఈ వెంకటేశ్ కూడా అలాగే చేశాడంటూ చెబుతున్నారు. అయితే ఆ సినిమా 2000లో వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో అలా మోసపోయినా తప్పు కాదు.. కానీ, ఇలాంటి రోజుల్లో ఇంత సిల్లీగా ఎలా మోసపోయావ్ బ్రో అంటూ అందరూ సునీల్ కుమార్ మీద జాలి చూపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి