Hyderabad: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు.. హైదరాబాద్ డాక్టర్ ప్రధాన సూత్రధారి!

Kidney Racket: తాజాగా అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టు రట్టు కాగా.. దానిలో హైదరాబాద్‌ డాక్టర్‌ ప్రధాన సూత్రాధారి కావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

Kidney Racket: తాజాగా అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టు రట్టు కాగా.. దానిలో హైదరాబాద్‌ డాక్టర్‌ ప్రధాన సూత్రాధారి కావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

నేటి కాలంలో సమాజాన్ని భయపెడుతున్న కొన్ని నేరాల్లో అవయవాల దొంగతనం ఒకటి. మనిషికి ప్రాణ దానం చేసే అవయవాలను కొందరు స్వార్థపరులు.. భారీ ధరకు విదేశాలకు దొంగతనంగా రవాణా చేస్తున్నారు. ఇక్కడ మన దేశంలో అమాయకులను మోసం చేసి.. వారి వద్ద నుంచి అవయవాలు సేకరించి.. వాటితో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే దీనిలో హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. మరి ఈ రాకెట్‌ ఎలా వెలుగులోకి వచ్చింది.. వీరు ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారు వంటి వివరాలు మీ కోసం..

ఇక ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ కొచ్చిలో వెలుగు చూడగా.. దీని మూలాలు హైదరాబాద్‌లో తేలాయి. కొచ్చిలో తీగ లాగితే.. భాగ్యనగరంలో ఈ కిడ్నీ రాకెట్‌ డొంక కదిలింది. దీనిలో హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడు ప్రధాన సూత్రధారికగా కేరళ పోలీసులు గుర్తించారు. బాధితుడు ఒకరు మృతి చెందడంతో ఈ రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో సబిత్‌ నాసిర్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. ఇక విచారణలో అతడు సంచలన విషయాలు వెల్లడించాడు.

ఈ కిడ్నీ రాకెట్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ముఖ్యమని.. వారే ఈ దందా నడిపిస్తున్నారని, వారిలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడని సబిత్‌ నాసిర్‌ వెల్లడించాడు. దీంతో ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైదరాబాద్‌ చేరుకుంది. మిగతా ఇద్దరు బ్రోకర్లను గుర్తించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఇక నాసిర్‌ చెప్పిన దాని ప్రకారం.. కిడ్నీలు అమ్మించిన ఆ వైద్యుడు ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పేద యువకులే టార్గెట్‌..

ఇక ఈ ముఠా కర్ణాటక, తెలంగాణలకు చెందిన పేద యువకులను టార్గెట్‌ చేసుకుని.. వారికి డబ్బు ఆశ చూపి.. ఇరాన్‌ తీసుకెళ్లి.. అక్కడ కిడ్నీలు అమ్ముకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే, బాధితుల్లో ఒకరు మృతి చెందడంతో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రాకెట్‌లో కీలక సభ్యుడు సబిత్‌ నాసిర్‌ను ఇరాన్‌ నుంచి కొచ్చికి వస్తుండగా ఆదివారం అతడ్ని ఎయిర్‌పోర్ట్‌లో కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

ఇక ఈ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితుడు సబిత్‌ ఈ దందాలో చేరడానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టరే ప్రధాన కారణమని తెలిసింది. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించిన సమయంలో సదరు డాక్టర్‌, సబిత్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మొదలైన వారి పరిచయం ఏళ్లుగా ఈ రాకెట్‌ను నడిపేందుకు దోహదం పడింది. బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన 40 మంది యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. వారి కిడ్నీలనను విక్రయించినట్లు సబిత్‌ విచారణలో అంగీకరించాడు.

ఇరాన్‌ తీసుకెళ్లి..

పేద కుటుంబాలకు చెందినవారిని గుర్తించి.. వారికి డబ్బులు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేందుకు ఒప్పుకునేలా చేస్తారు. ఇరాన్ వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్టు, వీసాల వంటి వాటిని నిందితులే సమకూర్చుతారు. రక్తసంబంధీకులు కానివారు అవయవ దానం చేసేందుకు ఇరాన్‌లో అనుమతి ఉండటంతో అక్కడకి తీసుకెళ్తున్నారని విచారణలో తేలింది. డోనర్స్ కిడ్నీ ఎవరికి సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేస్తారు.

ఆ తర్వాత కిడ్నీ ఇచ్చిన వ్యక్తిని.. 20 రోజులపాటు ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచి.. కోలుకున్న తర్వాత వెనక్కి తీసుకొస్తారు. ముందు ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షల వరకూ ఇస్తామని ఆశచూపి తీసుకెళ్లే ఈ ముఠా.. తీరా అన్ని లెక్కలు చూపించి.. చేతికి రూ.6 లక్షలు ఇస్తున్నట్లుగా వెల్లడైంది. ఇక సబిత్‌ చెప్పిన డాక్టర్‌ను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

Show comments