P Venkatesh
హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు అని తెలిపింది. సెలవు దినాల్లో కూడా ఈ బస్సులు నడవనున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు అని తెలిపింది. సెలవు దినాల్లో కూడా ఈ బస్సులు నడవనున్నట్లు వెల్లడించింది.
P Venkatesh
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అనతి కాలంలోనే గణనీయమైన అభివృద్ధిని సాధించింది. అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ దేశానికే రోల్ మోడల్ గా అవతరించింది. హైదరాబాద్ నగరం మహానగరంగా అవతరిస్తున్న వేళ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో డెవలప్ మెంట్ ఊహకందని రీతిలో జరుగుతోంది. అదే విధంగా పర్యాటక రంగాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను సుందరంగా ముస్తాబు చేస్తూ సకల వసతులు కల్పిస్తూ పర్యాటకాన్ని భలోపేతం చేస్తున్నది. ఈ క్రమంలో పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు హెచ్ఎండీఏ కీలక నిర్ణయం తీసుకున్నది. నగరంలో పర్యటించేందుకు వచ్చే సందర్శకులు ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించడానికి అనుమతినిచ్చింది.
హైదరాబాద్ లో పర్యాటక ప్రదేశాలకు కొదువ లేదు. చార్మినార్, గోల్కొండ కోట, బిర్లా టెంపుల్, సాలర్ జంగ్ మ్యూజియం, నెహ్రూ జూలాజికల్ పార్క్, ట్యాంక్ బండ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించడానికి హైదరాబాద్ వాసులతో పాటు, రాష్ట్ర ప్రజలు, దేశం నలుమూలల నుంచి, ప్రపంచ దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండీఏ హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో పర్యాటకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాగా హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రతిరోజూ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడుపనున్నారు. ఈ బస్సులు శని, ఆదివారాలు మరియు ఇతర సెలవు దినాలలో కూడా నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ లో గతంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేవారు. ఆ తర్వాత వాటిని ఆపేసారు. ఇటీవల మంత్రి కేటీఆర్ చొరవతో డబుల్ డెక్కర్ బస్సులను హెచ్ ఎండీఏ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో తిరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం ఏర్పాటు తర్వాత నెక్లెస్ రోడ్ వైపు సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. కాగా అన్ని పర్యాటక కేంద్రాలు కవర్ అయ్యేలా హుస్సేన్ సాగర్ చుట్టూ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పనున్నారు. ప్రస్తుతం సాగర్ చుట్టూ మూడు బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో ఉచింతంగా ప్రయాణించి సంజీవయ్య పార్క్, థ్రిల్ సిటీ, లేక్ ఫ్రంట్ వ్యూ, జలవిహార్ పార్క్, నీరా కేఫ్, పీపుల్స్ ప్లాజా, ఇందిరా గాంధీ, పీవీ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహం సెక్రటేరియట్, అమరవీరుల స్మారక స్థూపం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు.