సెలవులు పొడగింపు.. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆఫీస్‌లకు సర్కార్‌ ఆదేశాలు!

ఈ ఏడాది జూన్‌ నెల ముగిసి.. జూలై ప్రారంభం అయినా సరే వర్షాల జాడే కానరాలేదు. దాంతో ఈ సంవత్సరం వ్యవసాయం ఎలా అనే గుబులు మొదలయ్యింది. మరి ఇన్ని రోజులు లేట్‌ చేసినందుకో ఏమో.. గత నాలుగు రోజులుగా తెలంగాణలో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజధాని భ్యాగనగరం అయితే నాలుగు రోజులుగా ఆగకుండా కురుస్తోన్న వర్షంలో తడిసి ముద్దవుతుంది. హైదరాబాద్‌లో మాత్రమే కాక రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి దాక ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పైగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేయగా.. తీవ్రతను భట్టి ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. అన్ని విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ సెలవులను పొడిగిస్తూ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. అనగా శుక్రవారం సెలవులు ముగుస్తుండగా.. భారీ వర్షాల హెచ్చిక నేపథ్యంలో..శనివారం కూడా సెలవుగా ప్రకటించింది. సర్కార్‌ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు మళ్లీ సోమవారమే తెరుచుకోనున్నాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉంటే.. విద్యా సంస్థలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రెండు రోజులు సెలవు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌.. తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారిని ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్రవారం, శనివారం రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఇక భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. ప్రైవేట్ సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కుదిరితే శుక్రవారం, శనివారం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని అనుమతించాలంటూ నగరంలోని అన్ని ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించినప్పటికి.. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సర్కారు ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి.

Show comments