ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023కు టైమ్ దగ్గర పడుతోంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నమెంట్‌కు తెరలేవనుంది. భారత్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ జరగనున్న తెలిసిందే. ఈసారి టీమిండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు టోర్నీలో భాగం కానున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ మినహా మిగిలిన అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ టీమ్స్‌ను ప్రకటించాయి. ఈసారి ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. అయితే భారత పిచ్‌లపై రాణించడం అంత సులువు కాదు. ముఖ్యంగా టోర్నీ సెకండాఫ్‌లో పిచ్‌లు మరింత నెమ్మదిస్తాయి.
స్లో పిచ్‌లపై టర్న్, లో బౌన్స్‌ను ఎదుర్కొని పరుగులు చేయడం ఎంతటి బ్యాటర్లకైనా ఈజీ కాదు. కానీ ఇదే విషయం టీమిండియాకు కలిసొచ్చే అవకాశం ఉంది. సొంత గడ్డపై వరల్డ్ కప్ జరుగుతుండటం రోహిత్ సేనకు సానుకూలాంశంగా మారింది. ఇక్కడి పిచ్‌లన్నీ మన బ్యాటర్లకు కొట్టిన పిండే. అదే సమయంలో పేసర్లకు పెద్దగా సహకరించని ఈ పిచ్‌లపై బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలో టీమిండియా బౌలర్లకు బాగా తెలుసు. ఆసియా కప్, ఆస్ట్రేలియాపై సిరీస్ విజయాలతో భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. అందుకే చాలా మంది వెటరన్ క్రికెటర్లు వరల్డ్ కప్‌లో టీమిండియాను ఫేవరెట్‌గా చెబుతున్నారు. సొంతగడ్డపై భారత బ్యాటర్లను ఆపడం ఎవరి తరం కాదంటున్నారు.
ఈసారి వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరింత చెలరేగి ఆడతారని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. అయితే ఈ విషయంపై సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ప్రపంచ కప్-2023లో టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ‘ఈసారి వరల్డ్ కప్‌లో గిల్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు. అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గిల్ గొప్ప బ్యాటర్. అతడి టెక్నిక్ అద్భుతమనే చెప్పాలి. స్వదేశంలో మెగా టోర్నీ జరుగుతోంది కాబట్టి అతడిపై కొంత ఒత్తిడి ఉంటుంది. అయినా నేను గిల్‌కే ఓటేస్తాను. అతడు ట్రెడిషనల్ షాట్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాడు. బౌలర్ల మీద ఒత్తిడి పెంచే టెక్నిక్స్ అతడి వద్ద ఉన్నాయి. ఇలాగే ఆడుతూ పోతే మూడు ఫార్మాట్లలోనూ గొప్ప బ్యాటర్లలో ఒకడిగా గిల్ ఎదుగుతాడు’ అని డివిలియర్స్ మెచ్చుకున్నాడు.
ఇదీ చదవండి: చివరి వన్డేలో కోహ్లీ శివతాండవం తప్పదా?