MPగా గెలిచిన టీమిండియా క్రికెటర్.. కాంగ్రెస్ కంచుకోటలో విజయం!

లోక్​సభ ఎన్నికలు-2024లో ఓ టీమిండియా క్రికెటర్ విజయబావుటా ఎగురవేశాడు. కాంగ్రెస్ కంచుకోటలో అతడు విక్టరీ నమోదు చేశాడు.

లోక్​సభ ఎన్నికలు-2024లో ఓ టీమిండియా క్రికెటర్ విజయబావుటా ఎగురవేశాడు. కాంగ్రెస్ కంచుకోటలో అతడు విక్టరీ నమోదు చేశాడు.

లోక్​సభ ఎన్నికలు-2024 ఫలితాల కోసం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో చాలా సీట్లలో గెలుపోటముల మీద క్లారిటీ వచ్చింది. ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది. తాజాగా వెస్ట్ బెంగాల్​లోని బహరంపూర్ నియోజకవర్గం రిజల్ట్ వచ్చింది. ఈ స్థానం గురించి అంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఏం ఉందని అనుకునేరు? బహరంపూర్ నుంచి టీమిండియా మాజీ ఆల్​రౌండర్ యూసఫ్ పఠాన్ పోటీ చేశాడు. 2007, 2011 వరల్డ్ కప్స్ గెలిచిన జట్టులో సభ్యుడైన యూసఫ్.. తన రాజకీయ జీవితాన్ని విజయంతో ప్రారంభించాడు.

ఎంపీగా పోటీ చేసిన తొలి ఎన్నికలోనే గెలిచాడు యూసఫ్​ పఠాన్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఈ మాజీ క్రికెటర్.. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరీని ఓడించాడు. యూసఫ్​కు 4,08,240 ఓట్లు వచ్చాయి. మాజీ ఎంపీ అయిన అధిర్ రంజన్​ మీద 59,351 ఓట్ల తేడాతో థంపింగ్ విక్టరీ నమోదు చేశాడు. 25 ఏళ్లుగా కాంగ్రెస్​కు ఎదురులేని స్థానంలో యూసఫ్ విజయం సాధించడంతో తృణమూల్ కార్యకర్తలతో పాటు అతడి ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. క్రికెట్​లోనే కాదు.. పాలిటిక్స్​లోనూ యూసఫ్ తోపు అంటూ మెచ్చుకుంటున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్​లో నెగ్గిన తర్వాత చాలా మంది భారత స్టార్లు లోక్​సభకు చేరుకున్నారు. గౌతం గంభీర్, మహ్మద్ అజహరుద్దీన్, కీర్తి ఆజాద్, నవ్​జ్యోత్ సింగ్ సిద్ధు, చేతన్ చౌహాన్ ఈ లిస్ట్​లో ఉన్నారు.

ఇక, యూసఫ్ విజయం సాధించిన బహరంపూర్ నియోజకవర్గం బెంగాల్​లోని ముర్షీదాబాద్​ జిల్లాలో ఉంది. ఇక్కడ రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి 1999 నుంచి వరుసగా ఐదుమార్లు ఎంపీగా గెలిచారు. బెంగాల్​లో హస్తం పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాంటి నేత యూసఫ్ చేతిలో చిత్తయ్యారు. ఇక్కడ బీజేపీ నుంచి బరిలో ఉన్న డాక్టర్ నిర్మల్ చంద్ర సాహో సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ముస్లిం మెజారిటీ నియోజకవర్గమైన బహరంపూర్​ నుంచి ఇప్పటి వరకు ఆ కమ్యూనిటీ నుంచి ఎవరూ ఎన్నిక కాలేదు. దీంతో తృణమూల్ వ్యూహాత్మకంగా యూసఫ్​ను బరిలోకి దింపి ఫలితాన్ని రాబట్టింది.

Show comments