Bangladesh-Mob Set On Fire Mashrafe Mortaza House: స్టార్‌ క్రికెటర్‌ ఇంటిని తగలబెట్టారు.. అసలేం జరిగిందంటే..

స్టార్‌ క్రికెటర్‌ ఇంటిని తగలబెట్టారు.. అసలేం జరిగిందంటే..

Bangladesh Attack-Mashrafe Mortaza: దుండుగులు స్టార్‌ క్రికెటర్‌ ఇంటికి నిప్పు పెట్టారు. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఎందుకు అంటే..

Bangladesh Attack-Mashrafe Mortaza: దుండుగులు స్టార్‌ క్రికెటర్‌ ఇంటికి నిప్పు పెట్టారు. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఎందుకు అంటే..

మన పక్క దేశం బంగ్లాదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజల ఆందోళనలు, నిరసనలతో దేశం అట్టుడుకుతుంది. ఈ వ్యతిరేకతను తట్టుకోలేక.. బంగ్లా ప్రధాన మంత్రి షేక్‌ హసీనా.. తన పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి.. పారిపోయిన సంగతి తెలిసిందే. మరి బంగ్లాలో ఈ ఉద్రిక్తతలకు కారణం ఏంటంటే.. రిజర్వేషన్‌పై తీసుకున్న ఓ నిర్ణయం. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర‌ పోరాటంలో పోరాడిన మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. బంగ్లా ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ఓ చట్టం తీసుకువచ్చింది. అయితే దీనిపై భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు.

రెండు నెలల క్రితం పోలీసులు, విద్యార్థుల ఆందోళనకారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో వందలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మళ్లీ నిరసనకారులు వీధుల్లోకి రావడంతో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ క్రమంలో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో సైన్యం నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ బహిరంగంగా ప్రకటించారు.

ఇక ఆందోళనలో భాగంగా నిరసనకారులు.. ధనవంతుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న వారిపై రాళ్ల దాడి జరిగింది. ఈక్రమంలో స్టార్‌ క్రికెటర్‌ ఇంటికి నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మష్రఫే మోర్తజా ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు. అయితే క్రికెటర్‌ని ఎందుకు టార్గెట్‌ చేశారంటే.. మష్రఫే మొర్తజా ప్రధానమంత్రి షేక్ హసీనాకు మద్దతుదారుడు కావడంతోనే ఈ పని చేసినట్లు సమాచారం. మొర్తజా ఖుల్నా డివిజన్‌లోని నరైల్-2 నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో అవామీ లీగ్ అభ్యర్థిగా వరుసగా రెండవసారి మొర్తజా విజయం సాధించాడు. క్రికెట్‌తో పాటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాడు.

మొర్తజా క్రికెట్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. అతడు తన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను 2001లో ప్రారంభించాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ నైపుణ్యాల కారణంగా త్వరలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2009లో బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్‌గా మొర్తజా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు చాలా ముఖ్యమైన మ్యాచ్‌లను గెలుచుకుంది. 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోవడంలో మొర్తజా కీలకపాత్ర పోషించాడు. ఇక నాలుగేళ్ల క్రితం అనగా.. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆందోళనలో ఆయన ఇంటిని తగలబెట్టడం సంచలనంగా మారింది.

Show comments