Son Of India Review : సన్ ఆఫ్ ఇండియా రివ్యూ

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. పెద్దగా పోటీ లేకుండా దిగినప్పటికీ కంటెంట్ కంటే ఎక్కువ సోషల్ మీడియా ట్రోల్స్ తో పబ్లిసిటీ చేసుకున్న ఈ సినిమాకు ఊహించని విధంగా ఓపెనింగ్స్ వీక్ గా మొదలయ్యాయి. దర్శకుడు రత్నబాబుకి ఇది రెండో చిత్రం. అవరోధాలు అవహేళనలు ఎన్ని ఉన్నా టీమ్ మాత్రం దీని మీద చాలా నమ్మకంగా ఉంది. మరి ఈ సన్ ఆఫ్ ఇండియా వచ్చిన కాసిన్ని జనాన్ని మెప్పించి పాజిటివ్ టాక్ తెచ్చుకునేలా ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

విరూపాక్ష (మోహన్ బాబు)ఓ సగటు మధ్యతరగతి మనిషి. చట్టానికి దొరక్కుండా ప్రముఖులను కిడ్నాప్ చేస్తుంటాడు. అందులో భాగంగా నగరంలోని సెంట్రల్ మినిస్టర్, డాక్టర్, రాష్ట్ర మంత్రి అపహరణకు గురవుతారు. ఈ కేసును ఛేదించేందుకు ఎన్ఐఎ ఆఫీసర్ ఐరా(ప్రగ్యా జైస్వాల్) రంగంలోకి దిగుతుంది. అప్పుడు ఆ విరుపాక్ష తాలూకు చేదు గతం తెలుస్తుంది. అతను స్థాపించిన ప్రైవేట్ జైళ్లలో వాళ్ళు ముగ్గురు ఉన్నారని కనుక్కున్న ప్రభుత్వం మరి ఆ డిమాండ్లకు తలొగ్గి ఏం చేసింది, చివరికి విరూపాక్ష తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేది సినిమాలోనే చూడాలి

నటీనటులు

అరసహస్రం పైగా సినిమాలు చేసిన కళాప్రపూర్ణ మోహన్ బాబు గారి గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఆయనొక పవర్ హౌస్. డైలాగ్ కింగ్ బిరుదుకు అంతో ఇంతో సార్థకత చేకూరుస్తూ చాలా బలహీనమైన సన్నివేశాల్లో కొంతైన ప్రాణం ఉందంటే అది ఆయన పెర్ఫార్మెన్స్ వల్లే. మొత్తం తన భుజాల మీద నడిచే సబ్జెక్ట్ కావడంతో తన శాయశక్తులా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ నీళ్ళు లేని బావిలో ఎన్ని బిందెలు వేసి తోడినా లాభం లేదు. అందుకే ఈయన ఎంత కష్టపడినా చివరిదాకా భరించేందుకు ఆ ఒక్క కారణం సరిపోలేదు

పేపర్ మీద చదివితే ఇందులో గ్రాండ్ క్యాస్టింగ్ ఉంది. శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, సునీల్, ఆలీ, పృథ్వి, మీనా, నరేష్, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి ఇలా మొత్తం పాతిక దాకా ఉన్నారని టైటిల్ కార్డ్ లోనే చెప్పారు. కానీ ఒక్కొక్కరు కేవలం ఒక్క సీన్ లో మాత్రమే కనిపిస్తారు. మిగిలిన అవసరమున్న చోటల్లా బ్యాక్ షాట్స్ పెట్టి, లేదా మొహాలను బ్లర్ చేసి చూపించి ఇది ఎక్స్ పరిమెంట్ అని సరిపుచ్చారు. కానీ ఇదంత సహేతుకంగా అనిపించదు. పైగా మేమీ సినిమాలో నటించామని చెప్పుకోవడానికో ఇందులో వాళ్లకు చిన్న స్కోప్ కూడా దొరకలేదు. కేవలం వాళ్ళతో ఒరిజినల్ డబ్బింగ్ చెప్పించి మమ అనిపించారు

డైరెక్టర్ అండ్ టీమ్

ముందు ఓటిటి కోసం కథ రాసుకుని ఆ తరువాత థియేటర్ మెటీరియల్ గా మార్చామని దర్శకులు డైమండ్ రత్నబాబు చెప్పుకున్నారు కానీ నిజంగా ఇది డిజిటల్ లోనూ అంత ఈజీగా ఫిట్ అవ్వని కంటెంట్. హీరో కుటుంబానికి అన్యాయం జరిగి భార్యా కూతురిని పోగొట్టుకుంటే దానికి కారణమైన వాళ్ళను కిడ్నాప్ చేసి హత్య చేయడమనే పాయింట్ భారతీయుడు, ఠాగూర్ లాంటి ఎన్నో సినిమాల్లో చూసేశాం. ఈ ప్లాట్ లో ఎలాంటి కొత్తదనం లేదు. కానీ రత్నబాబు మళ్లీ అదే థీమ్ ని తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పోనీ అదైనా కొత్తగా డిఫరెంట్ గా ఏమైనా ప్రెజెంట్ చేశారా అంటే అదీ లేదు. ఏదో చప్పగా మొక్కుబడి వ్యవహారంగా సాగిపోవడం మైనస్ అయ్యుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో కొత్త ప్రయోగం అని నొక్కి నొక్కి చెప్పారు కానీ నిజానికిది వింత ప్రయోగం. వేరే ఆర్టిస్టులు లేకుండా కేవలం హీరోతోనే షోని నడిపించడం మంచి ఆలోచనే. కానీ దానికి డిఫరెంట్ గా అనిపించే స్టోరీ తీసుకోవాలి. ఎవరూ చేయనిది మనం చూపిస్తే జనం ఆహా ఓహో అనేయరు. వాళ్ళను కన్విన్స్ చేసే క్రియేటివిటీ కావాలి. పైగా గంటన్నర సింపుల్ నిడివిలో ముగించేస్తున్నప్పుడు వీలైనంత రేసీగా స్క్రీన్ ప్లే పరుగులు పెట్టాలి. కానీ సన్ ఆఫ్ ఇండియా ఏ దశలోనూ ఊహాతీతంగా సాగదు. పైగా ఏం జరగబోతోందో ఈజీగా గెస్ చేయొచ్చు. అలాంటప్పుడు థ్రిల్ ఎలా కలుగుతుంది. ఎంజాయ్ చేయడానికి ఏం మిగులుతుంది. సన్ ఆఫ్ ఇండియాలో జరిగింది ఇదే.

దర్శకుడిగా ఏదో చెప్పాలనుకున్న రత్నబాబు తపన అక్కడక్కడా కనిపిస్తుంది కానీ విపరీతంగా రాజీ పడిన నిర్మాణ విలువలు, అసలైన కథలో బలహీనతలు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. పోనీ ఆర్టిస్టులందరిని పూర్తిగా వాడుకుని దీన్నొ ఫుల్ లెన్త్ మూవీగా మార్చినా కథనం ఎంత రొటీన్ గా ఉన్నా సరే కనీసం మంచు అభిమానులకైనా నచ్చే ఛాన్స్ ఉండేది. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. పైగా ఇవి చాలవన్నట్టు అవసరం లేని ఓ అడల్ట్ సీను, పోసాని పక్కన ఉండే వ్యాంప్ క్యారెక్టర్ ఎక్స్ పోజింగ్ పంటికింద రాళ్ళలా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెడతాయి. అసలు ఇవి ఎందుకు పెట్టారా అనే ప్రశ్న స్క్రిప్ట్ స్టేజిలో వేసుకున్నారో లేక ఎడిటింగ్ లో కత్తెర వేశారో తెలియదు.

ఇలాంటి సీరియస్ డ్రామా నడుపుతున్నప్పుడు బేసిక్ లాజిక్స్ చాలా కీలకం. వాటిని చాలా కన్వీనియంట్ గా వదిలేశారు. దేశవ్యాప్తంగా 40 వేల మంది నిర్దోషులు ఉన్నారని విరూపాక్ష ఎలా డిసైడ్ చేసాడో అర్థం కాదు. కోట్లు కాదు కదా లక్షలు కూడా లేని ఇతను 16 ఏళ్ళు శిక్ష అనుభవించి వచ్చాక కళ్ళుతిరిగే పెద్ద పెద్ద భవంతులతో ప్రైవేట్ జైలు కట్టేస్తాడు. నిజాయితీకి ప్రాణం ఇచ్చే సన్ ఆఫ్ ఇండియాకి అంత డబ్బు ఎలా వచ్చిందో చూపించరు. పైగా గవర్నమెంట్ వెంటనే ఇతని ఆలోచనకు శెభాష్ అని మెచ్చేసుకుని ఖైదీలను రిలీజ్ చేస్తుంది. మన కామన్ సెన్స్ మీద మనకే డౌట్ వచ్చేలా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏదో మాయ చేసి జేజేలు కొట్టించడానికి ఇది మాస్ మసాలా కాదుగా. సీరియస్ డ్రామా అనుకున్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి.

మాస్ట్రో ఇళయరాజా సంగీతం సోసోనే. నేపధ్య సంగీతం అక్కడక్కడా పర్లేదనిపిస్తుంది. మొదటి పాట, బుర్రకథ బాగానే ఉన్నాయి కానీ ఆయన స్థాయిలో మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేవు. సర్వేశ్ మురారి ఛాయాగ్రహణం స్టాండర్డ్ లో లేదు. అంత అనుభవమున్న ఎడిటర్ గౌతమ్ రాజు కూడా నిస్సహాయతలుగా మిగిలిపోయారు. 90 నిమిషాలు కూడా ల్యాగ్ అనిపించిదంటే ఆయనొక్కటే భాద్యులుగా చేయలేం. నిర్మాణ విలువలు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఖర్చు కాకుండా వీలైనంత చుట్టేందుకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఎక్కడా రిచ్ నెస్ కనిపించదు. గ్రాఫిక్స్ కూడా ఘనంగా ఏమి లేవు. ఓవరాల్ గా జస్ట్ ఒక కౌంట్ తోడయ్యింది అంతే.

ప్లస్ గా అనిపించేవి

మోహన్ బాబు నటన
తక్కువ నిడివి

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్
రెండో సగం
కథా కథనాలు
ప్రొడక్షన్ వాల్యూస్

కంక్లూజన్

ఎలాంటి అంచనాలు పెట్టుకోకపోయినా సరే నిరాశపరచడంలో సన్ ఆఫ్ ఇండియా పూర్తిగా సక్సెస్ అయ్యాడు. మోహన్ బాబు ఎంత సీనియర్ స్టార్ అయినప్పటికీ బలమైన కథలో ప్రెజెంట్ చేసినప్పుడే జనం మెచ్చుతారు థియేటర్లకు వస్తారు. కానీ అలాంటి భరోసాని నమ్మకాన్ని ఇవ్వడంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. కలెక్షన్ కింగ్ ని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకుంటే తప్ప ఇంకే కారణం ఆప్షన్ గా పెట్టుకొనివ్వదు.

ఒక్క మాటలో – సారీ ఇండియా

Also Read : DJ Tillu Review : డీజే టిల్లు రివ్యూ

Show comments