నెక్ట్స్ నువ్వే రివ్యూ

  • Published - 09:54 PM, Fri - 24 November 17
నెక్ట్స్ నువ్వే రివ్యూ

బుల్లితెర మీద ప్ర‌భాక‌ర్ పేరు చెపితే తెలియ‌ని వారు ఉండ‌రు. బుల్లితెర మీద అన్ని ర‌కాల పాత్ర‌లు పోషిస్తూ తెలుగు జ‌నాల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయాడు. బుల్లితెర కింగ్ ప్ర‌భాక‌ర్ తొలిసారిగా మెగాఫోన్ ప‌ట్టుకుని డైరెక్ట్ చేసిన సినిమా నెక్ట్ నువ్వే. మూడు పెద్ద నిర్మాణ సంస్థ‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించ‌డంతో సినిమాకు ముందు నుంచే మంచి హైప్ వ‌చ్చింది. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ , బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి నెక్ట్ నువ్వేతో ప్ర‌భాక‌ర్ వెండితెర మీద కూడా మ్యాజిక్ చేశాడా ? లేదా ? అన్న‌ది చూద్దాం.

స్టోరీ :
కిర‌ణ్ (ఆది) సీరియల్స్‌ను డైరెక్ట్ చేస్తూ కాలం గ‌డుపుతుంటాడు. మనోడు ఓ గుండా ద‌గ్గ‌ర అప్పు చేస్తాడు. అత‌డి నుంచి బెదిరింపులు రావ‌డంతో సిటీ నుంచి పారిపోయి అర‌కు ప్రాంతానికి వెళ‌తాడు. అక్క‌డ త‌న తండ్రికి ఉన్న ఓ బంగ్లాను రిసార్ట్స్‌గా మార్చి బిజినెస్ పెడ‌తాడు. అయితే ఆ రిసార్ట్స్‌కు వ‌చ్చిన గెస్టులంతా చ‌చ్చిపోతుంటారు. అసలు ఈ చావులు ఎందుకు జ‌రుగుతున్నాయో కూడా తెలియ‌క కిర‌ణ్ ఈ చావుల‌కు కార‌ణం క‌నుక్కోవాల‌ని ట్రై చేస్తుంటాడు. ఈ ప్ర‌య‌త్నంలోనే అత‌డికి రిసార్ట్స్‌లో దెయ్యం ఉంద‌న్న నిజంతో పాటు మ‌రికొన్ని షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. మ‌రి కిర‌ణ్ అనుకున్న‌ట్టుగానే అక్క‌డ దెయ్యం ఉందా ? ఆ దెయ్యం అక్క‌డ ఎందుకు ఉంది ? చివ‌ర‌కు త‌న రిసార్ట్స్‌ను ఆ దెయ్యం భారీ నుంచి ఎలా కాపాడుకున్నాడు ? ఈ సినిమా క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్న‌దే నెక్ట్స్ నువ్వే స్టోరీ.

క‌థ‌నం & విశ్లేష‌ణ :
హీరో ఆది గ‌త సినిమాల‌తో పోల్చుకుంటే ఈ సినిమాలో బాగా మెచ్యూర్డ్‌గా క‌నిపించాడు. ఆ త‌ర‌హా జాన‌ర్ సినిమాల్లో న‌టించ‌డం ఆదికి కొత్తే అయినా క్యారెక్ట‌ర్‌లో అలా ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ వైభ‌వి చూడ‌డానికి అందంగాను ఉంది. బాగా చేసింది. హీరోయిన్ సినిమాకు చాలా ప్ల‌స్ కూడా. ఇక కామెడీతో బ్ర‌హ్మాజీ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాడు. బ్రహ్మాజీ సినిమా మొత్తం నవ్వించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా బ్రహ్మాజీ కెరీర్లో నిలిచిపోయే పాత్రగా ఉంటుంది. షకీలాతో చేసిన రొమాన్స్ హైలైట్ గా ఉంది. ర‌ఘుబాబు ఆర్జీవీగా కిత‌కిత‌లు పెట్టేశారు. ర‌ష్మీ మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో బాగా రెచ్చ‌గొట్టేసింది.

ఇక క‌థ‌నం విష‌యానికి వ‌స్తే సినిమాలో మెయిన్ ఎస్సెట్ బ్రహ్మాజీ కామెడీ ట్రాక్. సినిమా ఆరంభం నుండి చివరి వరకు హీరోతో పాటే ఉండే బ్రహ్మాజీ కామెడీ చాలా చోట్ల నవ్వించింది. ఫ‌స్టాఫ్‌లో అయితే బ్ర‌హ్మాజీ ప్ర‌తి ఐదు నిమిషాల‌కు స్క్రీన్ మీద మంచి కామెడీ సీన్‌తో క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను బాగా ఆహ్లాద‌ప‌రుస్తాడు. గ‌తంలో బ్రహ్మాజీ ఎన్నో రోల్స్ చేసినా ఈ రోల్ అత‌డికి కొత్త‌గా ఉంది. బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ సూప‌ర్బ్‌. ఇక ఆది న‌ట‌న‌తో పాటు హీరోయిన్, ర‌ష్మీ అంద‌చందాలు సినిమాకు మ‌రో ఆక‌ర్ష‌ణ‌. హిమజ సైతం తనదైన స్టైల్లో భయపెట్టి నవ్వించింది. అవసరాల శ్రీనివాస్ తనకు అలవాటైన పాత్రలో మరోసారి మెప్పించాడు.

ఇక సినిమాను ముందు సాదాసీదాగానే ప్రారంభించిన ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ కొద్ది సేప‌టికే పూర్తిగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ జాన‌ర్‌లోకి తీసుకెళ్లాడు. సినిమా ఎంట‌ర్‌టైన్‌మెంట్ జాన‌ర్‌లోకి వెళ్లిన వెంట‌నే ప్రేక్ష‌కుడు ఆ కామెడీ ఎంజాయ్ చేస్తూ మంచి ఆహ్లాదం పొందుతాడు. బ్రహ్మాజీ చెల్లెలిగా రష్మీ నటన మాస్ ఆడియన్సుకు బాగా క‌నెక్ట్ అవుతుంది. ఇక సాయి కార్తీక్ ఆర్ ఆర్ అద‌ర‌గొట్టాడు. ఫ‌స్టాఫ్‌లో కామెడీతో మెప్పించిన ప్ర‌భాక‌ర్ సెకండాఫ్‌లో హ‌ర్ర‌ర్ సీన్ల‌తో మెప్పించాడు. రిసార్ట్స్‌లో దెయ్యం ఉండ‌డం, అది ఒక్కొక్క‌రిని చంప‌డం లాంటి అంశాలు కాస్త ఉత్కంఠ‌గా తెర‌కెక్కించ‌డంలో ప్ర‌భాక‌ర్ స‌క్సెస్ అయ్యాడు. తోడు తాగుబోతు రమేష్, పోలీసుల ట్రాక్ కూడా మెప్పించింది. కాక‌పోతే సెకండాఫ్‌లో కాస్త సాగ‌దీసిన క‌థ‌నం, డైరెక్ష‌న్ ప‌రంగా ప్ర‌భాక‌ర్‌కు ఇదే తొలి సినిమా కావ‌డంతో అక్క‌డ‌క్క‌డా త‌డ‌బాటు మైన‌స్‌. అయితే ఓవ‌రాల్‌గా మాత్రం ప్ర‌భాక‌ర్ తొలి సినిమాకే ఈ రేంజ్ సినిమా తీశాడంటే మెచ్చుకోకుండా ఉండ‌లేం.

సాంకేతికంగా ఎలా ఉందంటే…
నెక్ట్ నువ్వేకు అన్ని సాంకేతిక విభాగాలు బాగా ప‌నిచేశాయి. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. తీసింది కొన్ని లొకేషన్లలోనే అయినా చక్కగా చేశాడు. ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్‌లో కొన్ని అనవసర సన్నివేశాలని తొలగించి ఉంటే సినిమా ఇంకా టైట్‌గా ఉండేది. ఆర్ట్ వ‌ర్క్ సినిమాకు అచ్చుగుద్దిన‌ట్టుగా స‌రిపోయింది. ఇక గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ , బన్నీ వాస్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ చిన్న సినిమాకు వారు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఖ‌ర్చు పెట్టారు.

ఓవరాల్ గా ప్రేక్షకుల్ని నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ప్రభాకర్ ఎక్స్ పీరియెన్స్ ఈ సినిమాకు పనికొచ్చింది. రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా కామెడీ పండించాడు. బ్రహ్మాజీ హిలేరియస్ కామెడీ పంచులు ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తాయి.

Show comments