బహుజనులకు రాజ్యాధికారం అనే నినాదంతో ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయం ఎదురుకావడం ప్రవీణ్‌కుమార్‌ను ఆలోచనలో పడేసింది. అయితే ఉత్తరప్రదేశ్ ఫలితాలు, అక్కడ పార్టీ పరిస్థితితో సంబంధం లేకుండా ప్రవీణ్‌కుమార్ తన పని తాను చేసుకుపోతున్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలు చేపడుతున్నారు. పల్లెలో పర్యటనలు చేస్తున్నారు. బహుజన రాజ్యాధికారం వస్తేనే పేదలకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. కేసీఆర్ గడీల పాలనకు తెరదించుతామని శపథాలు చేస్తున్నారు.
పరిస్థితి తారుమారు..
రాజ్యాధికారంపై బలమైన నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్.. తొలుత టీఆర్‌ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. గులాబీ పార్టీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత సొంతంగా రాజకీయపార్టీ పెడతారనే చర్చ జరిగింది. ఇవేమీ కాకుండా.. ఆయన బహుజన సమాజ్‌వాదీ (బీఎస్పీ) పార్టీలో చేరారు.ఆ పార్టీ రథసారధిగా నియమితులయ్యారు. అప్పటినుంచి అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమి.. ప్రవీణ్‌కుమార్‌ను ఆలోచనలో పడేసింది. బీఎస్పీ అధినేత మాయావతి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చేసిన రాజకీయం చూసిన వారు.. ఇక ఆ పార్టీ పని అయిపోయినట్లు భావించారు. అనుకున్నట్లుగానే బీఎస్పీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది. పార్టీని, అభ్యర్థులను ముందుండి నడిపించాల్సిన మాయావతి.. పగ్గాలు వదిలేశారు. పోటీ చేయకపోవడమే గాక.. అభ్యర్థుల తరపున కనీసం ప్రచారం కూడా చేయలేదు.
బలపడేందుకు అవకాశం ఉన్నా..
తెలంగాణలో బీఎస్పీ బలపడేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. బహుజనుల జనాభా అధికమే గాక.. ప్రజా చైతన్యం కూడా ఎక్కువే. గతంలోనూ బీఎస్పీ తెలంగాణలో తన ఉనికిని చాటుకుంది. 2014 ఎన్నికల్లో ఎపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 253 సీట్లలో పోటీ చేసిన బీఎస్పీ.. తెలంగాణలో సిర్పూర్, నిర్మల్ అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. సీపీఎం, సీపీఐల కన్నా ఎక్కువ ఓట్లను సంపాదించుకుంది. తన లక్ష్యానికి అనుకూలమైన పార్టీగా బీఎస్పీ ఉండడం, స్థానికంగా పార్టీ బలోపేతానికి అవకాశం ఉండడంతో ప్రవీణ్‌కుమార్ ఏనుగు ఎక్కారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీని వదిలేయడంతో ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.