నాడు నా ప్రాణాలు కాపాడింది ఈ డాక్టరే.. ఆశీర్వదించండి: కేసీఆర్‌

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌. రోజుకు 2,3 సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ చోట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు కేసీఆర్‌. ఆ వివరాలు..

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌. రోజుకు 2,3 సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ చోట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు కేసీఆర్‌. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. మిగతా పార్టీలతో పోలిస్తే.. కారు పార్టీ ఎన్నికల రంగంలో స్పీడ్‌గా దూసుకుపోతుంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి.. ఎన్నికల బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోసం అటు రాజశ్యామల యాగం నిర్వహిస్తూనే.. నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేస్తూ.. ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు గులాబీ బాస్‌. రోజూ కనీసం మూడు సభల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నాడు భైంసా, ఆర్మూర్, కోరుట్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని.. అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు కేసీఆర్‌. ఈ క్రమంలో కోరుట్ల సభలో ప్రసంగించిన కేసీఆర్.. అక్కడి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్ సంజయ్ గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సంజయ్‌ నాడు తన ప్రాణాలు కాపాడారని గుర్తు చేసుకున్నారు కేసీఆర్‌.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘సంజయ్‌ మంచి డాక్టర్‌. సంపాదనే ముఖ్యం అనుకుంటే తన వృత్తి ద్వారానే కోట్ల రూపాయలు గడించేవాడు. కానీ తనకు డబ్బు ముఖ్యం కాదు.. పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న సంకల్పంతో ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యాడు. అయితే.. ఉద్యమం సమయంలో సంజయ్‌ నా ప్రాణాలు కాపాడాడు. నేను నిరాహార దీక్ష చేసిన సమయంలో.. డాక్టర్‌ సంజయ్‌ నా దగ్గరుండి.. కంటికి రెప్పలా చూసుకుంటూ.. నన్ను కాపాడాడు. సంజయ్‌ నాకు బిడ్డ లాంటి వాడు. పైగా తాను ఇక్కిడి వాడు. అతడిని ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నాను’’ అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు వచ్చి ఆపద మొక్కులు మొక్కుతారని.. వాళ్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు కేసీఆర్‌. ఒకవేళ వాళ్లను నమ్మితే మళ్లీ పరిస్థితి మునపటిలాగే మారుతుందని హెచ్చరించారు. అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను కేసీఆర్ ఈ సందర్భంగా మరో సారి వివరించారు. దళితబంధు, రైతు బంధు, రైతు రుణమాఫీ లాంటి అన్ని పథకాలు కొనసాగుతాయని.. ఈసారి వీటితో పాటుగా కేసీఆర్ బీమాను కూడా అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇక బీడీ కార్మికుల గురించి ప్రస్తావిస్తూ.. కొంత ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులెవ్వరూ బెంగ పడొద్దని.. అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Show comments