iDreamPost
android-app
ios-app

అక్కడ ‘ఆందోళన’ల రాజకీయం..!

అక్కడ ‘ఆందోళన’ల రాజకీయం..!

తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి ఏడేళ్ల రాజకీయం ఒక ఎత్తు అయితే.. గడిచిన ఏడాది నుంచి జరుగుతున్న రాజకీయం మరో ఎత్తు. గడిచిన ఏడాది కాలం నుంచి తెలంగాణ రాజకీయం పూర్తిగా మారిపోయింది. కారణం బీజేపీ బలపడే ప్రయత్నాలు గట్టిగా చేస్తుండడం. బీజేపీ పార్టీ కేసీఆర్‌పైన, టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై నిత్యం విమర్శలు, తరచూ ఆందోళనలు, నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళుతోంది. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఆయా విమర్శలకు సమాధానం చెప్పకతప్పడం లేదు. ఇంతకు ముందు, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చేసిన, చేస్తున్న విమర్శలపై గులాబీ దళపతి పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ బీజేపీ చేస్తున్న విమర్శలపై మాత్రం వెంటనే స్పందిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.

బీజేపీ ధర్నా అంటే.. ప్రతిగా టీఆర్‌ఎస్‌ ధర్నా అంటోంది. బీజేపీ నిరసన కార్యక్రమం అంటే.. కారు పార్టీ కూడా నిరసన కార్యక్రమం నిర్వహిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీలు పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ నాయకులు ధాన్యం కొనుగోలు అంశంపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఏసంగిలో వచ్చే ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనంటూ ఇటీవల మరోసారి కేసీఆర్‌ తేల్చి చెప్పారు. పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోలు చేయాలని, దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు అందరూ ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంతో గడిచిన సీజన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమం చేపట్టింది.

ధాన్యం కొనుగోలు అంశంపై కమలం పార్టీని టీఆర్‌ఎస్‌ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండడంతో పోటీగా కమలం పార్టీ నేతలు కూడా కారు పార్టీని ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు అంశంపై బీజేపీ రాజకీయం మొదలుపెట్టింది. విద్యుత్‌ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. డిస్కంలకు ప్రభుత్వ విభాగాల నుంచి బకాయిలు చెల్లించకుండా, పాతబస్తీలో బిల్లులు వసూలు చేయకుండా.. ప్రజల నెత్తిన భారం వేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ రోజు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఓ వైపు ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్‌ఎస్‌ ఆందోళనలు, మరో వైపు విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా బీజేపీ ధర్నాలు.. మొత్తంగా తెలంగాణలో రాజకీయం ధర్నాలు, నిరసనల చుట్టూ తిరుగుతోంది.