iDreamPost
android-app
ios-app

జగన్ ఉచ్చులో టీడీపీ, అధికారపక్షం ఆశించినట్టే జరుగుతోందా..?

  • Published Mar 25, 2022 | 12:47 PM Updated Updated Mar 25, 2022 | 12:56 PM
జగన్ ఉచ్చులో టీడీపీ, అధికారపక్షం ఆశించినట్టే జరుగుతోందా..?

భక్తుడు కోరుకున్నదే దేవుడు వరమిస్తే కలిగే ఆనందమే వేరు. సరిగ్గా ఇప్పుడు ఏపీలో అధికారపక్షం తీరు అలానే ఉంది. తాము ఆశించినట్టే విపక్షాలు వ్యవహరించడం వైఎస్సార్సీపీలో ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజా రాజకీయ పరిణామాలన్నీ తాము కోరుకున్నట్టుగా జరుగుతుండడం ఆ పార్టీలో జోష్ పెంచుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు ఎజెండా తామే డిసైడ్ చేయాలని అధికార పార్టీ ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచించింది. ఇప్పుడది ఫలిస్తోంది.

2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. జగన్ ఉచ్చులో చంద్రబాబు పడ్డారంటూ ఆరోజు మోడీ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. ప్రత్యేకహోదా అంశంలో విపక్షం ఆశించినట్టుగా అప్పటి అధికార టీడీపీ వ్యవహరించింది. చివరకు హోదా ఒక కీలక ఎజెండాగా ఎన్నికలు జరగడం టీడీపీ పుట్టిముంచేసింది. అప్పటికే హోదా చుట్టూ పలుమార్లు నాలుక మడతపెట్టిన బాబు ధోరణితో విసిగిపోయిన జనం జగన్ కు జై కొట్టారు.

వరుసగా రెండో ఎన్నికల్లో కూడా అదే జరుగుతోంది. ఈసారి కూడా జగన్ ట్రాప్ లో టీడీపీ విలవిల్లాడాల్సి వస్తోంది. రాబోయే ఎన్నికలకు కూడా ఎజెండా జగన్ ఫిక్స్ చేసేయడం విశేషం. అమరావతి వర్సెస్ అదర్స్ అన్నట్టుగా మార్చేశారు. ఇప్పటికే ఆయన చెప్పినట్టు వన్ పర్సెంట్ కి 99కి మధ్య ప్రయోజనాల వైరుధ్యం ఉండడంతో వ్యవహారం దాని చుట్టూ తిరగబోతోంది. ఆర్థికమంత్రి బుగ్గన వ్యాఖ్యానించినట్టు మూడు మండలాల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజల అవసరాలకు మధ్య పోటీగా పరిణామం చెందబోతోంది. దాంతో ఈసారి కూడా వైఎస్సార్సీపీ నేతలనే ఎజెండా ఫిక్స్ చేయడంతో టీడీపీ దాని చుట్టూ తిరిగే స్థితిని కొనితెచ్చుకుంది.

సహజంగా సభలో అయినా, ఎన్నికల్లోనయినా ఎజెండా ఎవరు ఫిక్స్ చేస్తే వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే అధికార పక్ష ఎజెండాని కాదని, వాయిదా తీర్మానాలతో విపక్షాలు హడావిడి చేస్తాయి. వాటిని పాలకపక్షాలు తోసిపుచ్చుతూ ఉంటాయి. ఇక ఎన్నికల్లో కూడా ఎవరు ఎజెండాని నిర్ణయిస్తే వారికి అనుకూలంగా చర్చలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. దానిని సానుకూలంగా మలచుకునే వీలుంటుంది. అది 2019 లో స్పష్టంగా రుజువయ్యింది. మరోసారి అదే తేలబోతోంది. అందుకే వైఎస్సార్సీపీ ఉచ్చులో పడిన చంద్రబాబు విలవిల్లాడాల్సి వస్తోంది. అమరావతిలో బాబు ఢాంబీకాలను చివరకు ఆ ప్రాంతవాసులే నమ్మలేదు. మంగళగిరిలో లోకేష్ నే జనం ఓడించారు. కాబట్టి అమరావతి అనేది పొలిటికల్ గా బాబు పుట్టిముంచే అంశం కాబోతోంది. అది తెలిసిన టీడీపీ నేతలు ఇప్పుడు నిండా మునిగిపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో పడ్డట్టు కనిపిస్తోంది.