iDreamPost
android-app
ios-app

ఔను మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఉమా?

  • Published Mar 23, 2022 | 7:01 PM Updated Updated Mar 23, 2022 | 7:28 PM
ఔను మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఉమా?

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక సమాజంలో ఉన్నామా? అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దానికి సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీయేనన్న సంగతి మరచిపోతున్నారు? పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ సారా తాగి చనిపోయారంటూ ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు తాము ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామా? అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం తాగిన మరణాలపై నిరసన వ్యక్తం చేద్దామనుకుంటే ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు రాకుండా ముందస్తుగా పోలీసులు గృహనిర్భందం చేశారని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అసెంబ్లీని ఎందుకు వినియోగించుకోరు?

గత 13 రోజులుగా అసెంబ్లీలోనూ, బయటా జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా తాగి చనిపోయారంటూ ఆందోళన చేయడం మినహా మరే కార్యక్రమాన్ని ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ నిర్వహించలేదు. రోజు రోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్టు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వాన్ని నిలదీయడానికి, దాని వైఫల్యాలను ఎత్తి చూపడానికి చక్కటి వేదిక అయిన అసెంబ్లీని వినియోగించుకోకుండా సభ కార్యకలాపాలను రోజుకో విధంగా అడ్డుకుంటూ, సస్పెండ్‌ అయి బయటకు వచ్చేస్తున్నారు. కేవలం సభను అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వెళుతున్నారు అన్న సంగతి ఇప్పటికే జనానికి అర్థమైంది.

చర్చ కన్న రచ్చకే ప్రాధాన్యమా..

సభలో విజిల్స్‌ ఊదడం, చప్పట్లు కొట్టడం, భజనలు చేయడం, సభాపతితో వాగ్వాదానికి దిగడం వంటి చర్యలతో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. అంతేగాని స్పీకర్‌ సమయం ఇచ్చినప్పుడే ఈ అంశంపై తమ వాదన వినిపించాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని టీడీపీ ప్రదర్శించడం లేదు. సభలో ఈ అంశాన్ని చర్చించడానికి నిబంధనల ప్రకారం ఎన్నో అవకాశాలు ఉండగా అవన్నీ కాదని కేవలం రచ్చకే ప్రాధాన్యం ఇవ్వడం అరాచకం కాదా?  కనీసం ప్రభుత్వం ఇచ్చే వివరణను వినకుండా అల్లరి చేయడం దేనికి? ముఖ్యమంత్రి ఈ విషయంపై సవివరంగా ప్రకటన చేస్తే అసలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించడం జనాన్ని పక్కదారి పట్టించాలనే యత్నం కాదా? సభ బయట కూడా రోజుకోవిధంగా నిరసన అంటూ హంగామా చేయడం, మీడియాలో ప్రచారం పొందడం మీదే టీడీపీ దృష్టి పెడుతోంది అన్న విమర్శలను ఎదుర్కొంటోంది.

ఇది వ్యూహాత్మకమేనా?

అసెంబ్లీలో సజావుగా జరిగితే ప్రభుత్వం విస్తృతంగా చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చలు జరుగుతాయి. అప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై జనంలో మరింత సానుకూలత ఏర్పడుతుంది. దాన్ని అడ్డుకోవడానికే చంద్రబాబు అసెంబ్లీలో తమ సభ్యులతో వ్యూహాత్మకంగా అల్లరి చేయిస్తున్నారని అధికారపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులుగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరును చూస్తే అధికార పార్టీ నాయకుల ఆరోపణ నిజమే అనిపించేలా ఉంది. ఎందుకంటే అటు తమ అనుకూల మీడియాలోనూ, ఇటు అసెంబ్లీలో, బయటా దీనిపై రచ్చ చేస్తోంది తప్ప మిగిలిన అంశాలేవీ పట్టించుకోవడం లేదు. ఈ వైఖరిని ప్రజాస్వామ్యం అంటారా? అరాచకం అంటారా? అన్నది తెలుగుదేశం నాయకులే చెప్పాలి.