జనసేనకు100 సీట్లు? పొత్తులో కొత్త ట్విస్ట్!

మరి కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏపీలో పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. ఇక చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాల్లో.. ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. స్కిల్‌ డెవలప్‌ స్కామ్‌లో భాగంగా చంద్రబాబుకి ఏపీ ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు మీద గతంలో నమోదయిన కేసులు మరోసారి తెర మీదకు వస్తున్నాయి.

అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబుకు.. జనసేన అధ్యక్షడు పవన్‌ కళ్యాణ్‌ పూర్తి మద్దతివ్వడమే.. జైలుకు వెళ్లి మరీ ఆయనను కలవడంతో.. పవన్‌ వైఖరి ఏంటో.. జనాలకు పూర్తిగా అర్థం అయ్యింది. మొన్నటి వరకు టీడీపీ, జనసేన పొత్తు గురించి ఎక్కడా స్పష్టత ఇ‍వ్వని పవన్‌.. జైల్లో బాబుతో ములాఖత్‌ అయిన వెంటనే.. పొత్తు పక్కా అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక పవన్‌ వైఖరిని.. ప్రజలు మాత్రమే కాక.. జనసేన కార్యకర్తలు సైతం సమర్థించలేకపోతున్నారు. అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన బాబుకు పవన్‌ మద్దతివ్వడం చూసి జనాలు విస్తుపోతున్నారు.

బాబుకు పవన్‌ మద్దతు సంగతి కాసేపు పక్కన పెడితే.. టీడీపీ, జనసేన మధ్య పొత్తులుపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక సీట్ల పంపకంపై కసరత్తు జరగాలి. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండి ఉంటే.. పరిస్థితి ఒకలా ఉండేది. కానీ ప్రస్తుతం బాబు జైలుకు వెళ్లడంతో.. ఏపీలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాబు తర్వాత చినబాబే అని కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. కానీ లోకేష్‌ మాత్రం.. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. కేడర్‌లో ధైర్యం నింపేలా ఒక్కసారి కూడా మాట్లాడలేదు.. ఒక్క ప్రకటన చేయలేదు. పైగా బాలయ్య, యనమల వంటి నేతలు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. దాంతో టీడీపీ పగ్గాలు బాలయ్యకే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

చంద్రబాబు బయట ఉన్నన్ని రోజులు.. జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందని.. ప్రచారం సాగింది. అయితే జనసేనకు 40-50 సీట్లు కేటాయించడం కూడా కష్టమే అనే భావించారు అందరూ. కానీ చంద్రబాబు అరెస్ట్‌తో పరిస్థితి తారుమారయ్యింది. ప్రస్తుతం టీడీపీ, జనసేన కూటమిని.. పవన్‌ కళ్యాణే ముందుండి నడిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. దాంతో జనసేకు ఎక్కువ సీట్లు కేటాయించాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చిందంట. ఇక పవన్‌ అన్నట్లు.. బీజేపీ కూడా ఈ కూటమితో కలిస్తే.. అప్పుడు ఈ రెండు పార్టీలకు కలిపి.. వంద సీట్లు కేటాయించాలనే డిమాండ్‌ను తెర మీదకు తెస్తున్నారు జనసేన లీడర్లు, కార్యకర్తలు.

మొత్తం 175 సీట్లలో మెజారిటీ షేర్‌లో భాగంగా టీడీపీకి 75 సీట్లు కేటాయించి.. జనసేన, బీజేపీకి కలిసి 100 సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారట. ఒకవేళ ఈ డిమాండ్‌ గనక నిజమైతే.. ఇందుకు టీడీపీ అంగీకరించదు. జనసేన, బీజేపీకి 75 సీట్లు కేటాయించడానికి కూడా టీడీపీ అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా కాదని ఆ రెండు పార్టీలకు 100 సీట్లు అని పట్టుబడితే.. పొత్తులు వికటిస్తాయి అంటున్నారు. మరి సీట్ల పంపకానికి వచ్చే సరికి ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి అంటున్నారు జనాలు.

Show comments