Tirupathi Rao
Tirupathi Rao
విశాఖలో జరుగుతున్న వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసే వ్యాఖ్యలు అన్నీ అసత్యాలు అంటూ కొట్టిపారేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి మీదే కాకుండా తనపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రాజీనామా చేయమని చెప్పడానికి పవన్ ఎవరని ఎంపీ ప్రశ్నించారు. దమ్ముంటే తనపై ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. “రిషికొండలో అభివృద్ధి జరుగుతుంటే దానిని అడ్డుకోవడానికి వెళ్తున్నారు. హైదరాబాద్ లో ఒక ఆక్షన్ నిర్వహిస్తే ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అదంతా కొండలను పూర్తిగా చదును చేసి చేసింది. దాని మీద పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. 2047లో రావాల్సి ఉన్న డీడీఆర్ ముందే తీసుకున్నాం అని చెబుతున్నారు. ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో అసలు తెలుసా? అన్నీ తెలుసుకుని మాట్లాడతాను అని చెప్పే పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు. విశాఖలో నువ్వు ఎందుకు ఎంపీ అయ్యావు అని నన్ను అడుగుతారు. నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి నేను ఎంపీ అయ్యాను. జగన్ గారిని చూసి.. నాకున్న మంచి పేరుని చూసి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు.
నేను గెలిచిన దగ్గరి నుంచి ఇక్కడే ఉండి ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తున్నాను. నువ్వు గాజువాకలో ఓడిపోయిన తర్వాత ఎవరికైనా అందుబాటులో ఉన్నావా? ఎవరితోనైనా మాట్లాడావా? నువ్వు మద్దతు తెలిపి.. కలిసి పోటీ చేస్తున్న బీజేపీ వాళ్లు వైజాగ్ స్టీల్ పలాంట్ ని ప్రైవేటీకరణ చేస్తుంటే నువ్వు ఎందుకు అడ్డుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మీతో ఉండను ఎందుకు చెప్పడం లేదు. విశాఖ వదిలి పారిపోతాను అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను విశాఖ నుంచి పారిపోవాల్సి వచ్చే పనులు నేను ఎప్పుడూ చేయలేదు. నన్ను ఎంపీగా రాజీనామా చేయమని అడగడానికి నువ్వు ఎవరు? దమ్ముంటే నా మీద ఎంపీగా పోటీ చేయ్.
రెండుచోట్ల పోటీ చేసి రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడిపోయావ్. ఒక్క సీటు గెలిచింది నువ్వు. నీకు ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఇల్లు లేదు.. హైదరాబాద్ ప్యాలెస్ లో కూర్చున్నావ్. నేను గత పాతికేళ్లుగా వ్యాపారవేత్తగా ఉన్నాను. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. విశాఖ అభివృద్ధిలో మా పాత్ర కూడా ఉంది. ఎంపీగా ఉండి మేము బిజినెస్ చేయకూడదు అని చెబుతున్నావ్. మరి.. రాజకీయాల్లో ఉంటూ నువ్వు ఎందుకు సినిమాలు చేస్తున్నావు? కోతిలా ఎందుకు గెంతుతున్నావ్? ఎందుకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావ్? అంటే నువ్వు సినిమాలు చేసుకోవచ్చు.. మేము మాత్రం వ్యాపారాలు చేసుకోకూడదు. నువ్వు చేసిన సినిమాల్లో నష్టం వస్తే డబ్బులు కూడా తిరిగి ఇవ్వవు. మొన్న ఏదో బ్రో అనే సినిమా వచ్చింది.
అందులో డిస్ట్రిబ్యూటర్లకు 30 నుంచి 40 శాతం డబ్బులు పోయాయి. వారికి తిరిగి ఇవ్వు నువ్వు. నాకు ధైర్యం లేదు అంటున్నావ్. పవన్ కల్యాణ్ నీకు దమ్ము, ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయ్. టీడీపీ వాళ్ల వెనక ఎందుకు తిరుగుతున్నావ్. వాళ్ల మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నావ్? వాళ్లు ఇచ్చే 25, 30 సీట్లు, 2 ఎంపీ సీట్ల కోసం ఎందుకు కాపు కులస్థుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి.. ఎందుకు వాళ్లని బాధ పెడుతున్నావ్. ఆ రోజు వాళ్ల పేరు చెప్పుకుని ఇవాళ్ల చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నావ్. ప్యాకేజీ తీసుకుని నీ పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు బూట్లు నాతుకున్నావ్ నువ్వు. ఏస్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ చదువుతున్నావ్. నీకంటూ ఒక ఇండివిడ్యూవాలిటీ ఉందా? అసలు నీ మేనిఫెస్టో ఏది? నువ్వు రాష్ట్రానికి ఏం చేయాలి అనుకుంటున్నావ్? విశాఖ అభివృద్ధి కోసం ఏం చేయాలి అనుకుంటున్నావ్ చెప్పు” అంటూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రశ్నించారు.