మణిపూర్ అమ్మాయిల బాధ్యత తీసుకుని.. మంచి మనసు చాటుకున్న మంత్రి!

మణిపూర్ లో పరిస్థితులు ఎంతగా దిగజారాయో అందరికీ తెలిసిందే. ఆ అల్లర్లు తర్వాత చాలా మంది శరణార్థులుగా వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. సొంత ఊరు, పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ సరిహద్దులు దాటేస్తున్నారు. వారిలో కొందరు కర్ణాటకకు శరణార్థులుగా చేరుకున్నారు. వారికి కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ భరోసానిచ్చారు. మణిపూర్ శరణార్థుల్లో 29 మంది చదువుకునే అమ్మాయల బాధ్యత ఆయన తీసుకున్నారు.

మణిపూర్ అల్లర్ల కారణంగా చాలా మంది రాష్ట్ర దాటిపోయారు. వివిధ రాష్ట్రాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. అలాగే కర్ణాటకలోని చామరాజ్ పేట్ సెయింట్ థెరెస్సా విద్యాసంస్థల్లో కొందరు ఆశ్రయం పొందుతున్నారు. వారిలో 29 మంది అమ్మాయిలు చదువుకునే వాళ్లు ఉన్నారు. మంగళవారం కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ పుట్టినరోజు సందర్భంగా మంచి మనసు చాటుకున్నారు. ఆశ్రమానికి వెళ్లిన మంత్రి అక్కడున్న మణిపూర్ శరణార్థులతో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేశారు. వారి కన్నీటి గాధను విని చలించిపోయారు. ఆ శరణార్థుల్లో ఉన్న చదువుకునే అమ్మాయిలకు తాను బాసటగా ఉంటానంటూ మాటిచ్చారు.

వారి చదువు పూర్తి అయ్యేందుకు ఇంకా ఏడేళ్ల సమయం ఉంది. ఈ ఏడు సంవత్సరాలు వారి చదువుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తక్షణ అవసరాల కోసం రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జమీర్ అహ్మద్ తీసుకున్న నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. జమీర్ అహ్మద్ మంచి మనసు చాటుకున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చామరాజపేట్ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడుసార్లు జేడీఎస్ నుంచి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌంజిగ్, మైనారిటీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రి జమీర్ అహ్మద్ “నేషనల్ ట్రావెల్స్” పార్టనర్ కూడా.

Show comments