P Krishna
Karnataka: ఈ మధ్యకాలంలో చాలా మంది రీల్స్, సెల్పీల మోజులో పడి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల పాలవుతున్నారు. దురదృష్ట వశాత్తు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
Karnataka: ఈ మధ్యకాలంలో చాలా మంది రీల్స్, సెల్పీల మోజులో పడి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల పాలవుతున్నారు. దురదృష్ట వశాత్తు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
P Krishna
ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెల్ఫీలు దిగడం ఫ్యాషన్ అయ్యింది. విహార ప్రదేశాలు, స్నేహితులు, సెలబ్రెటీలు కనిపిస్తే వారితో సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు సెల్ఫీ మోజుల పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అందమైన జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుందామని వెళ్లిన బీటెక్ విద్యార్థిని ప్రమాద వశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయింది. రాళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆ యువతి దాదాపు 20 గంటల పాటు నరకం అనుభవించి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. అచ్చం ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా శివరాంపూర్ గ్రామానికి చెందిన సోమనాథ్ కుమార్తె హంస(19) విహారయాత్రకు స్నేహితులతో కలిసి మందరగిరి కొండకు వచ్చింది. స్నేహితులతో కలిసి మైదాలా సరస్సు వద్దకుకు చేరుకుంది. అప్పటికే ఆ సరస్సు వేగంగా ప్రవహిస్తుంది. హంస సరస్సు వద్దకు చేరుకొని సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించింది.. అక్కడ నాచుపై కాలు పెట్టడంతో జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. హంస నీటిలో కొట్టుకు పోవడంతో స్నేహితులంతా కంగారు పడి వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక అధికారులు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రిస్క్యూ టీమ్ తో రంగంలోకి దిగారు. అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులతో కలిసి దాదాపు 20 గంటలపాటు గాలింపు చేపట్టారు. జలపాతం దగ్గర ఇసుక బస్తాలు వేసి నీటిని మళ్లించేందుకు బృందాలు ప్రయత్నించాయి. అగ్నిమాపక సిబ్బంది యోగేష్, ప్రదీప్, మంజునాథ్, అన్నప్ప కేకలు వేస్తూ రాళ్ళ మధ్యకు వెళ్లారు. రక్షించండీ అంటూ హంస దీనాలాపంగా అరుస్తూన్న గొంతు వినిపించింది. దాంతో ఆమె బ్రతికే ఉందని నిర్ధారించుకున్న టీమ్ మెల్లిగా అక్కడికి వెళ్లి ఆమెకు చేయి అందించి రాళ్ల మధ్యలో నుంచి బయటకు తీసుకువచ్చి ప్రాణాలు రక్షించారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని హంసను ప్రాణాలతో రక్షించడంలో రెస్క్యూ టీమ్ విజయం సాధించింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా తుమకూరు జిల్లా ఎస్పీ కెవి అశోక్ మాట్లాడుతూ.. ‘సరస్సు ఎంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో ప్రాణాలకు తెగించిన రక్షించడం అనేది ఎంతో రిస్కూతో కూడుకున్న విషయం. మొదట ఆ యువతి ప్రాణాలతో బయటపడుతుందనే నమ్మకం లేదనిపించింది. అయితే, రెస్క్యూ టీమ్ తమ ప్రాణాలను పణంగా పెట్టి లోపలికి ప్రవేశించారు. ఆ రాత్రంతా నడుము లోతు నీళ్లలో రాళ్ళ మధ్యలో చిక్కుకొకి ప్రాణాలు కాపాడుకున్న ఆ అమ్మాయి ధైర్యాన్ని కూడా అభినందించాలి. మొత్తానికి రెస్క్యూ బృందం విజయం సాధించారు. యువతి ప్రాణాలు కాపాడటం నిజంగా గర్వించదగ్గ విషయం.ప్రజలు ఇలాంటి ప్రమాదం కలిగించే సరస్సులు, జల ప్రవాహాల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం’ అని అన్నారు.
ఈ విషయం గురించి బాధితురాలు హంస మాట్లాడుతూ..‘అప్పటి వరకు అందరం హ్యాపీగా ఫోటోలు దిగాం.. సెల్ఫీ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి తిరిగి వచ్చేద్దామనుకున్నా. అంతలోనే నాచుపై కాలు పెట్టడంతో జారి నీటి ప్రవాహంలో పడిపోయాను. నాకు ఈత రాదు.. రక్షించమని గట్టిగా అరిచాను. నీటిలో కొట్టుకుంటూ వెళ్లి రాళ్ల మధ్యలో చిక్కుకున్నా. ఎవరైనా కనిపిస్తారేమో అంటూ రక్షించండి అంటూ అరుస్తూనే ఉన్నా. నడుం లోతు నీళ్ళలో అరుస్తూ నా గొంతు కూడా పోయింది. దేవుడు పంపించినట్లు రెస్క్యూ బృందం నన్ను గమనించి రక్షించారు. తహసీల్దార్, అగ్నిమాపక శాఖ, పోలీసులు నన్ను రక్షించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా జన్మంతా రుణపడి ఉంటాను. నన్ను సజీవంగా చూసి నా తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం మంచిది కాదు.. ప్రాణాలకే ప్రమాదం అని ప్రతి ఒక్కరూ గమనించాలని నా ప్రార్థన’ అని హంస సలహా ఇచ్చింది. ఏది ఏమైనా ఈ సంఘటన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించిందని అంటున్నారు.