Dharani
Dharani
త్వరలోనే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారుబోతుంది అంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. అతి త్వరలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నోలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే రోజులు ఎంతో దూరం లేవు. దీని గురించి నేను అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నాను అన్నారు. ఇలాంటి రాజ్యంగ విరుద్ధమైన బిల్లులను ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తెలిపారు. గతంలో ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కోసం మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఈ సభలో బిల్లును ప్రవేశపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం సభలో ప్రవేశపెట్టిన ఢిల్లీ బిల్లు ద్వారా గౌరవసభ హోదాను ఈ ప్రభుత్వం కించపరుస్తోందని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై ఇటు కేజ్రీవాల్ సర్కార్, అటు కేంద్ర ప్రభుత్వాలు తమ రాజకీయ పోరాటాన్ని సభ వెలుపల చూసుకోవాలని ఒవైసీ సూచించారు. కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల థింక్‌ట్యాంక్ నుంచే వచ్చారంటూ ఒవైసీ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ కూడా బీజేపీ ప్రభుత్వ మనిషేనని ఆరోపించారు.
ఇదిలావుంటే, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లోక్‌సభలో చేసిన కామంట్స్.. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్ విభజనతో బీజేపీ విధానం బయటపడిందని.. త్వరలోనే హైదరాబాద్‌తో పాటు చెన్నై,బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నోలను యూటీలుగా మార్చే అవకాశం ఉందంటూ ఒవైసీ గత ఏడాది కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ విభజన చూసి చప్పట్లు కొడుతున్న సెక్యులర్ పార్టీలు.. భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు కూడా రెడీగా ఉండాలంటూ హెచ్చరించారు. తాజాగా మరోసారి హైదరాబాద్ యూటీ కాబోతుంది అంటూ వ్యాఖ్యానించి.. కలకలం రేపారు.