iDreamPost
iDreamPost
పవన్ కల్యాణ్ సినిమా భీమ్లానాయక్ విడుదలైన థియేటర్ల వద్ద ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. సినిమాకు వచ్చేవారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉద్యోగులను థియేటర్ల వద్ద ఉంచారని ఆయన ఆరోపించడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ఖండిస్తున్నారు. శనివారం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ధియేటర్ల వద్ద కర్ఫ్యూలాంటి వాతావరణం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహనరెడ్డికే దక్కిందన్నారు.
ప్రభుత్వం సామాన్యుల పక్షం వహించి సినిమా టిక్కెట్టు ధరలను తగ్గిస్తే అదేదో ఘోరం అన్నట్టు ప్రతిపక్షాలు ప్రచారం చేయడం వింతగా ఉంది. ఒక స్టార్ హీరో సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ధియేటర్ల వద్ద జరిగే బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటే మనోహర్ బాధపడిపోవడం ఎందుకు? ఎక్కువ ధరలకు టికెట్ అమ్మకుండా అధికారులు పర్యవేక్షణ చేస్తే దాన్ని కర్ఫ్యూ వాతావరణంగా అభివర్ణించడమే బాధాకరం. ప్రభుత్వం ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేయడం ఏముంది? తక్కువ ధరకు టికెట్ కొనుక్కొని హాయిగా సినిమా చూసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటె ప్రేక్షకుడు ఎందుకు భయపడతాడు? అక్కడ భయపడింది బ్లాక్ మార్కెట్ చేసేవాళ్లు. ఇన్నాళ్లూ సామాన్యులను అడ్డంగా దోచుకున్నవాళ్లు.
పవన్ కల్యాణ్ కు వచ్చిన నష్టం ఏమిటి?
ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నటుడు పవన్ కల్యాణ్ కు వచ్చిన నష్టం ఏమిటి? భీమ్లానాయక్ సినిమాకు ఆల్రెడీ ఆయన రెమ్యూనరేషన్ తీసేసుకున్నారు. టికెట్ల ను బ్లాక్ లో అమ్మినా, వైట్ లో అమ్మినా ఆయనకు వచ్ఛిన ఇబ్బంది ఏమిటి? బ్లాక్ టికెట్ల అమ్మకాలు అరికడితే ప్రభుత్వం ఆయనను వేధించటం ఎలా అవుతుంది. అధిక ధరలతో ప్రేక్షకులను ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులను బ్లాక్ మార్కెటీర్లు దోచుకోవాలనే మనోహర్ కోరుకుంటున్నారా? ఇదెక్కడి పద్దతి? ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేస్తున్నా విమర్శలు చేయడమే రాజకీయం అనుకుంటున్నారా? అని వైఎస్సార్ సీపీ నేతలు మనోహర్ ను ప్రశ్నిస్తున్నారు.
ప్రజలు ఇటువంటి పాలననే కోరుకుంటారు..
సీఎం జగన్మోహాన్‌రెడ్డి ఇలాంటి పరిపాలన అందిస్తారని ఎవరూ ఊహించలేదని, సీఎం కేవలం అహకారంతోనే ఇలా వ్యవహరించారని మనోహర్ చేసిన ఆరోపణలు సినిమా డైలాగులు మాదిరిగా ఉన్నాయి. ఇందులో అహకారం, ఆత్మాభిమానం అనే అంత సీన్ లేదు. సినిమాను, రాజకీయాలను ముడిపెట్టి ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, ఆయన పరిపాలనలో బ్లాక్ టికెట్ల అమ్మకాలు సాగడం లేదని బాధపడడమే విచిత్రంగా ఉంది. సామాన్యులు ముఖ్యమంత్రి నుంచి ఇటువంటి పాలననే కోరుకుంటారన్న సంగతి మనోహర్ గ్రహించాలని వైఎస్సార్ సీపీ నేతలు సూచిస్తున్నారు.