iDreamPost
iDreamPost
అది డబ్బులు దండుకునే కార్యక్రమం. ఖాళీ ఖజానాను నింపుకునేందుకే ఓటీఎస్ పథకం తెచ్చారు. ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలేమిటి? అని ఎత్తి పొడిచారు. ప్రభుత్వం ఇచ్చే రిజిస్ట్రేషన్ పత్రాలు చెల్లవని దుష్ప్రచారం చేశారు. ఎవరూ డబ్బులు కట్టొద్దు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లు ఇన్ని అగచాట్లు పడినా టీడీపీ కుతంత్రాలు పనిచేయలేదు. చంద్రబాబు బృందం చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద చేపట్టిన ఓటీఎస్ స్కీమును ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది వినియోగించుకోవడమే దీనికి నిదర్శనం. పైగా ఓటీఎస్ వసూళ్లలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు అగ్రస్థానంలో నిలవడం విశేషం.
శాశ్వత హక్కు కోసమే ఓటీఎస్
రాష్ట్రంలో గతం నుంచీ ప్రభుత్వాలు పేదలకు పక్కా ఇళ్ల పథకం అమలు చేస్తున్నాయి. అయితే లబ్ధిదారులకు వాటిని అనుభవించడమే తప్ప శాశ్వత హక్కులు ఉండేవి కావు. దానివల్ల అవసరాలకు వాటిని అమ్మడానికి లేదా బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం పొందే అవకాశం లేదు. దీన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం గతం నుంచీ ఇళ్లు పొందిన లబ్ధిదారులందరికీ వర్తించేలా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందిన లబ్ధిదారుల పాత బకాయిలు రద్దు చేయడంతో పాటు ఇంటిపై సర్వహక్కులు వారికి కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఆ రిజిస్ట్రేషన్ పత్రాల సహాయంతో ఇళ్లను అమ్ముకోవడానికి, బ్యాంక్ రుణం పొందే హక్కు లబ్ధిదారులకు లభిస్తుంది. దీనికి వన్ టైం సెటిల్మెంట్(ఓటీఎస్) కింద గ్రామీణ లబ్ధిదారులు రూ.10 వేలు, పట్టణ ప్రాంత లబ్ధిదారులు రూ.20 వేలు చెల్లిస్తే సరిపోతుంది.
ప్రజలను రెచ్చగొట్టేందుకు టీడీపీ కుట్ర
తాను అధికారంలో ఉండగా ఎప్పుడూ ఇటువంటి ఆలోచన చేయని టీడీపీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించగానే కుట్రపూరిత రాజకీయానికి తెరలేపింది.డబ్బులు దండుకోవడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిందని, రిజిస్ట్రేషన్ పత్రాలు చెల్లుబాటు కావని ఒకసారి.. ఎవరూ డబ్బులు కట్టొద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని మరోసారి.. పరస్పర విరుద్ధ ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. చంద్రబాబు నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఊరువాడా ఇదే ప్రచారం చేశారు. ఓటీఎస్ తప్పనిసరి కాదని, ఇష్టం ఉన్నవారే డబ్బులు కట్టవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసినా..
డబ్బులు కట్టకపోతే ఇళ్లు రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారంటూ పలు చోట్ల ఆందోళనలు కూడా చేయించింది. కానీ టీడీపీ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మలేదని ఓటీఎస్ పథకానికి లభించిన స్పందన చూస్తే అర్థం అవుతుంది.
10 లక్షల మంది.. రూ.339 కోట్లు
ఓటీఎస్ డబ్బులు చెల్లించి శాశ్వత గృహ హక్కు పత్రాలు పొందేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 9.86 లక్షల మంది లబ్ధిదారులు పేర్లు నమోదు చేయించుకుని ఓటీఎస్ కింద రూ.339 కోట్లు చెల్లించారు. విశేషం ఏమిటంటే ఈ పథకం వేస్ట్ అని ప్రచారం చేసిన చంద్రబాబు మాటలను ఆయన సొంత జిల్లా చిత్తూరు ప్రజలే విశ్వసించలేదని తేలింది. జిల్లాలవారీ వసూళ్లలో రూ. 61 కోట్లతో ఆ జిల్లాయే ప్రథమస్థానంలో నిలవడం గమనార్హం. రూ.41 కోట్ల వసూళ్లతో తూర్పు గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిస్తే.. రూ. 32 కోట్లతో నెల్లూరు జిల్లా మూడో స్థానంలో ఉంది. ఈ అంకెలే రాష్ట్ర ప్రజల్లో జగన్ సర్కారుకు ఎంత విశ్వసనీయత ఉందో.. అదే సమయంలో చంద్రబాబు పట్ల ప్రజలు ఎంత అపనమ్మకంతో ఉన్నారో తేటతెల్లం చేస్తున్నాయి.