iDreamPost
android-app
ios-app

ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ

  • Published Mar 29, 2024 | 6:15 PM Updated Updated Mar 29, 2024 | 6:15 PM

Pithani Balakrishna: ఏపీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కీలక నేత ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. ఆ వివరాలు..

Pithani Balakrishna: ఏపీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కీలక నేత ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 29, 2024 | 6:15 PMUpdated Mar 29, 2024 | 6:15 PM
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్‌ నిర్వహించనున్నారు. ముందస్తు ప్రణాళికలు, వ్యూహాలతో అధికార వైసీపీ పార్టీ ఎన్నికల కదన రంగంలో దూసుకుపోతుండగా.. విపక్ష కూటమిలో మాత్రం ఇంకా సర్దుబాట్లు, సీట్ల పంపిణీ వ్యవహారమే సాగుతోంది. ఇక నేడు అనగా శుక్రవారం నాడు టీడీపీ 9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దాంతో అనంతపురం అర్బన్‌ టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ సీనియర్‌ నేత ప్రభాకర్‌ చౌదరికి టికెట్‌ కేటాయించలేదు. దాంతో ఆయన వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఇక ఇదిలా ఉండగా ఎన్నికలకు ముందు జనసేనకు భారీ షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత ఒకరు రాజీనామా చేశారు. ఆ వివరాలు..

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది జనసేన పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 సీట్లు మాత్రమే కేటాయించారు. దాంతో అభ్యర్థుల ఎంపికలో సీట్లు దక్కని నేతలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నేత జనసేనకు షాకిచ్చారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శనివారం వైసీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కనీసం తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ ఆరోపించారు. పొత్తులో భాగంగా 21 సీట్లు వస్తే ఒక్క శెట్టి బలిజకు కూడా సీటు ఇవ్వలేదన్నారు.

పితాని బాలకృష్ణ విషయానికి వస్తే.. జనసేనలో చేరడానికి కన్నా ముందు ఆయన వైసీపీలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకూ ముమ్మిడివరం వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. దాంతో అసంతృప్తి వ్యక్తం చేసిన పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ముమ్మిడివరం జనసేన సమన్వయకర్తగా కొనసాగుతూ వస్తున్నారు.

అయితే 2024 ఎన్నికల్లో ముమ్మిడివరం, రామచంద్రాపురం స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని పితాని బాలకృష్ణ భావించారు. కానీ చివరకు ఆయనకు సీటు దక్కలేదు. దాంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పితాని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు గుడ్ బై చెప్పిన పితాని బాలకృష్ణ.. తిరిగి సొంతగూటికి చేరేందుకు రెడీ అయ్యారు. శనివారం, లేదా ఆదివారం రోజు సీఎం జగన్ సమక్షంలో పితాని బాలకృష్ణ వైసీపీ కండువా కప్పుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.