Dharani
ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఆ వివరాలు. .
ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఆ వివరాలు. .
Dharani
ఓ పార్టీ అధ్యక్షుడు అంటే గెలుపోటములతో సంబంధం లేకుండా.. అతడికి రాష్ట్రవ్యాప్తంగా పట్టుండాలి. ఎక్కడికెళ్లినా జనాలు ఆదరించాలి. అప్పుడే అతడు విజయం సాధించినట్లు. నాయకుడు అంటే కేవలం తన సామాజిక వర్గం మాత్రమే కాక కులమతాలకతీతంగా అందరి అభిమానాన్ని సంపాదించుకోవాలి. విశ్వమానవుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి. తాను ఇదే కోవకు చెందుతానని.. తనకు కులాలు, మతాలతో పట్టింపు లేదని.. తాను అందరి వాడిని అని పదే పదే ప్రచారం చేసుకుంటాడు పవన్ కళ్యాణ్. కుల రాజకీయాలే తనకు నచ్చవని.. గొప్పలకు పోతాడు. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాల పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నాడని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మరి ఇన్ని నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ చివరకు చేసింది ఏంటి అంటే.. కుల రాజకీయం.
అందరికి శకునాలు చెప్పే బల్లి.. చివరకు కుడితి తొట్టిలో పడి చచ్చింది అనే సామెతలా తయారయ్యింది పవన్ పరిస్థితి. కులాల కంపు, మతాల చిచ్చు అంటూ పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పే పవన్.. చివరకు తను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం కోసం అదే కులాస్త్రాన్ని వాడుకుంటున్నాడు. దానిలో భాగమే తాను పోటీ చేయబోయే స్థానం కోసం గాలించడం. మొన్నటి వరకు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తాడని ప్రచారం సాగింది. కానీ తాజాగా టీడీపీ-జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పవన్ పోటీ చేయబోయే స్థానం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అసలు పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తాడా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది.
ఇన్నాళ్లు భీమవరం నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేసుకున్న పవన్.. ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నాడట. ఇప్పుడు ఆయన పిఠాపురం మీద ఆసక్తి చూపుతున్నాడట. మరి పవన్ ఇంత అకస్మాత్తుగా తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడు అంటే.. కాపు ఓటు బ్యాంకు అంటున్నారు రాజకీయ పండితులు. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల నుంచి పోటీ చేయగా.. దానిలో భీమవరం ఒకటి. అయితే ఆ ఎన్నికల్లో పవన్ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓడి పోయాడు. దాంతో మరోసారి రానున్న ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేసి.. విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావించాడట.
భీమవరంలో కూడా కాపు ఓట్లు అధికంగానే ఉన్నాయి. పైగా ఇక్కడ నుంచి గెలిచిన గ్రంధి కూడా కాపు నేతనే. ఆయనకు ఇక్కడ కాపుల్లో బలమైన పట్టుంది. కేవలం కులం ఓట్లు మాత్రమే నమ్ముకున్న పవన్.. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే.. కాపులు ఓట్లు కాదు కదా.. మిగతా సామాజిక వర్గాల ఓట్లు కూడా తనకు రావని భయపడి.. అక్కడ నుంచి పోటీ చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడని ఇప్పుడు టాక్. భీమవరంలో పవన్ గెలుస్తాడని ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలు నమ్మినా పవన్‌కు మాత్రం ఆ నమ్మకం కలగడం లేదట. పైగా ఈ ఎన్నిక తనకు రాజకీయంగా చావు బతుకుల సమస్య కావడంతో.. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అందుకే భీమవరం నుంచి పిఠాపురానికి మార్చాడని అంటున్నారు రాజకీయ పండితులు.
పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ఉంది. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణ.. ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాపు ఓట్లు. ఈ నియోజకవర్గంలో సుమారు 90 వేలకు పైగా కాపు ఓట్లు ఉన్నాయి. అంటే సగం ఓట్లు కాపులవే. దాంతో పిఠాపురంలో పోటీ చేస్తే తన గెలుపు ఈజీ అవుతుందని.. కాపులందరూ తనకు ఓటు వేస్తారని పవన్ భావిస్తున్నారట. అందుకే భీమవరం నుంచి తప్పుకుని పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది.
అయితే ఈసారి పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో వైసీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీ చేయబోతున్నారు. ఆమెకు పిఠాపురం ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. పైగా ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచి రికార్డు సృష్టించింది. మహిళా నేత మాత్రమే కాక కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కూడా. పైగా నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ.. జనాల్లో ఆమెపై నమ్మకం, నియోజకవర్గంపై బలమైన పట్టు సాధించారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే జగన్ ఈసారి ఆమెకు అవకాశం కల్పించారు. దాంతో పిఠాపురంలో కాపు ఓట్లు అధికంగా ఉన్నాయి.. అవే తనను గెలిపిస్తాయని భావించిన పవన్‌కు అక్కడ కూడా ఓటమి తప్పదు అంటున్నారు.
పార్టీ అధ్యక్షుడై ఉండి.. గెలిచే సీటు కోసం పవన్ ఇన్ని పాట్లు పడటం చూసి జనసేన పార్టీ కార్యకర్తలే జాలి పడుతున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. ఇలా ఎక్కడా గెలిచే దమ్ము లేక వెతుకులాటలో ఏకైక వ్యక్తి పవన్ మాత్రమే అని.. అతడికి తప్ప ఇలాంటి పరిస్థితి ఏ నాయకుడికి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపు ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని భీమవరం నుంచి పిఠాపురం చేంజ్ అవ్వబోతున్న పవన్ అక్కడ కూగా గెలవడం చాలా కష్టం అంటున్నారు కార్యకర్తలు. మరి పవన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందో చూడాలి.