iDreamPost
android-app
ios-app

Anil Kumar: పార్టీ మార్పు విషయంపై అనిల్ కుమార్ యాదవ్ ఓపెన్ కామెంట్స్!

Anil Kumar: పార్టీ మార్పు విషయంపై అనిల్ కుమార్ యాదవ్ ఓపెన్ కామెంట్స్!

నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ ముఖ్య నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. నిత్యం వార్తల్లో నిలిచే ఆయన గతకొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. మంత్రి పదవి తొలగించడంతో అనిల్ కుమార్ యాదవ్ గుర్రుగా ఉన్నారని.. పార్టీని కూడా వీడుతున్నారు.. అందుకే ఏ విషయంలోనూ స్పందించడం లేదంటూ చాలానే ప్రచరాలు జరిగాయి. అయితే ఇలాంటి ప్రచారాలకు స్వయంగా అనిల్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పారు. అసలు విషయాన్ని తేల్చేశారు. సొంత పార్టీ నేతలపై కూడా అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు.

తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అనిల్ కమార్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపైనే కాకుండా.. సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ పై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారబోతన్నట్లు తనపై వస్తున్న ప్రచారాలను అనిల్ కుమార్ తప్పుబట్టారు. తాను సీఎం జగన్ కు మిలిటెంట్ స్క్వాడ్ లాంటి వాడని చెప్పారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీని వీడేది లేదంటూ స్పష్టం చేశారు. సీఎం జగన్ ను తన గుండె చప్పుడుగా చెప్పుకొచ్చారు.

తనను కోస్తే.. జగన్ మోహన్ రెడ్డి కనిపిస్తారంటూ వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారతానేమో అని కోరుకుంటున్న కొన్ని ఛానల్స్ కోరిక తీరదని తెలిపారు. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఒక 20 రోజులు విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపారు. చిన్న బ్రేక్ మాత్రమే ఇచ్చారని.. రేపటి నుంచి ప్రత్యర్థులు తన సత్తా చూస్తారని వ్యాఖ్యానించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తన ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వారికి పరాజయం తప్పదన్నారు. ఎవరు అడ్డొచ్చినా వేగంగా వచ్చే బుల్లెట్ ట్రైన్ లా గుద్దేస్తానంటూ తెలిపారు. 2024లో గెలిచి చూపిస్తానంటూ సవాలు చేశారు. ముఖ్యమంత్రిని కొందరు నాయకులు తిడుతుంటే వైసీపీ వాళ్లు మౌనంగా ఉంటున్నారని.. ఇకపై అలా ఉండదని తెలిపారు. వచ్చే ఎన్నికల నుంచి తప్పుకోవాలని జగన్ చెబితే నవ్వుతూ తప్పుకుంటానని స్పష్టం చేశారు. చిన్న వయసులోనే రెండుసార్లు ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రిగా చేశానంటే అందుకు కారణం సీఎం జగన్ అని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.