iDreamPost
iDreamPost
కాంగ్రెస్ పార్టీ మరో ప్రయోగం చేస్తోంది. రాహుల్ గాంధీ కొత్త ఎన్నికల వ్యూహకర్తను తెరమీదకు తీసుకొచ్చారు. దేశంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్ స్థాయి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశంకోసం ఎదురుచూస్తున్న ప్రశాంత్ కిషోర్ కి పోటీగా ఒకనాటి ఆయన సహచరుడినే కాంగ్రెస్ రంగంలోకి దింపడం ఆసక్తిగా మారింది. పీకే తొలుత కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినప్పటికీ అతని షరతులకు కాంగ్రెస్ అధిష్టానం ససేమీరా అనడంతో సీన్ మారిపోయింది. బీజేపీతో పాటుగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా పీకే విమర్శించడానికి సిద్దమయ్యారు. రాహుల్ నాయకత్వం మీద ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఈ తరుణంలో రాహుల్ తనకు సహాయం కోసం ఒకనాటి ఐప్యాక్ కీలక భాగస్వామిని రంగంలో దింపింది. అందుకు తగ్గట్టుగా ఏపీకి చెందిన సునీల్ కనుగోలు ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించారు.
సునీల్ చాలాకాలం పాటు బీజేపీ కోసం పనిచేశారు. మోదీ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నించిన టీమ్ లో ఆయనది కీలక పాత్ర. ప్రశాంత్ కిషోర్ దూరమయినప్పటికీ బీజేపీకి అనుకూలంగా సునీల్ కొనసాగారు. ఆయన స్థాపించిన మైండ్ షేర్ అనలిటిక్స్ (ఎంఎస్ఏ) బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో ముఖ్యభూమిక నిర్వహించింది. అయితే ప్రస్తుతం ఆ సంస్థ డైరెక్టర్ గా ఉన్న సునీల్ కనుగోలు తో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. బీజేపీతో పాటుగా వివిధ పార్టీలకు కూడా సునీల్ సేవలందించారు. మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఇప్పుడు ఆయనతో కాంగ్రెస్ ఒప్పందం ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం కర్ణాటక వ్యవహారాల్లో సునీల్ టీమ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణాలో ఎంఎస్ఏ టీమ్ వచ్చిందని చెబుతున్నారు. కాంగ్రెస్ తరపున త్వరలో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం, రాజకీయ వ్యూహాల రూపకల్పన, అమలు బాధ్యతలను కూడా సునీల్ బృందానికి అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణాలో పీకేతో టీఆర్ఎస్ జతగట్టింది. ఆయనకు పోటీగా కాంగ్రెస్ కి సునీల్ సేవలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సునీల్ కనుగోలు తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. విజయవాడ నుంచి ఆయన తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడ్డారు. తొలుత ఆయన అమెరికాలోని ప్రముఖ ఎంఎన్‌సీ మెక్‌కిన్సేలో పనిచేశారు. ఆ తర్వాత ఇండియాలో ఐప్యాక్ లో భాగస్వామి అయ్యారు. 2016లో పీకే నుంచి దూరమయ్యారు. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్(ఏబీఎం)అనే సంస్థను స్థాపించారు. తర్వాత సొంతంగా మైండ్ షేర్ అనలిటిక్స్ సంస్థ స్థాపించి, డైరెక్టర్‌గా సునీల్ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో ఆయన ఏమేరకు ప్రభావం చూపుతారన్నది చర్చనీయాంశం అవుతోంది. పీకే వ్యూహాలకు సునీల్ ఎత్తులు ఏమేరకు సమాధానం అవుతాయో చూడాలి.