iDreamPost
iDreamPost
ముందుండే వాడే నాయకుడు. ముందు చూపుతో వ్యవహరించేవాడే మార్గదర్శకుడు. కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండడమే అసలైన నాయకత్వం. ఆపదలో తోడుగా ఉండడమే నిజమైన నేతృత్వం. అందుకే ఇప్పుడు జగన్ ప్రభుత్వ తీరు మీద హర్షాతికేతాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వ పనితీరు ని అనేక మంది అభినందిస్తన్నారు. బాధితులు కూడా తమకు ప్రభుత్వం భరోసాగా నిలిచిందనే ధీమాతో ఉన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కొందరు కంపెనీ ముందు చేపట్టిన రాజకీయ నిరసన మాత్రమే కనిపించింది. అది మినహా ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకతకు అవకాశం లేకుండా ఇంత పెద్ద ప్రమాదంలోనూ ప్రభుత్వం పనితీరు ప్రజల మనసుని గెలిచింది.
ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించడం, ఒకవేళ ఎదురయితే నిబద్ధతతో ఎదుర్కోవడమే అన్నింటికన్నా ముఖ్యం. అందుకు తగ్గట్టుగా ప్రమాదం విషయం తెలిసిన 6గం.ల్లో ముఖ్యమంత్రి విశాఖలో వాలిపోయారు. కేజీహెచ్ లో అడుగుపెడితే పదవీ గండం ఉందనే సెంటిమెంట్ ని పక్కన పెట్టి ప్రజలకు అండగా ఉండే నాయకుడిగా వ్యవహరించారు. బాధితులకు భరోసా కల్పించేలా భారీ నష్టపరిహారం ప్రకటించారు. కంపెనీ విషయంలో కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పేందుకు తగ్గట్టుగా ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అంతటితో సరిపెట్టుకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రమాదకర కంపెనీల వివరాలను సేకరించారు. వాటిపై సమీక్ష నిర్వహించారు. మొత్తం 82 రసాయన, గ్యాస్ ఆధారిత పరిశ్రమల విషయంలో కఠిన చర్యలకు పూనుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
అదే సమయంలో ప్రమాదం జరిగిన వెంకటాపురం , ఎస్సీ, బీసీ కాలనీ, పద్మనాభపురం, నందమూరి నగర్ గ్రామాల ప్రజలకు అండగా ఉండేందుకు మంత్రుల బృందాన్ని విశాఖలో ఉండాలని ఆదేశించారు. నష్టపరిహారం ప్రకటించిన మరునాడే నిధులు విడుదల చేశారు. తాజాగా మృతుల కుటుంబాలకు, బాధితులకు వాటిని అందించేలా చర్యలు తీసుకున్నారు. ఘటన జరిగిన నాలుగు రోజుల్లో ఎక్స్ గ్రేషియా బాధితుల చేతుల్లోకి చేరింది. వాటికితోడుగా కంపెనీ సమీప ప్రాంతాల్లో రసాయనాల తీవ్రతను తగ్గించేందుకు అనుగుణంగా సమగ్ర చర్యలు చేపట్టారు. మొత్తంగా గ్యాస్ ప్రభావం తగ్గించేందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో భారీ వర్షం కూడా కురవడంతో ప్రకృతి సహకరించడం ద్వారా మూడు రోజులు గడవకముందే మొత్తం పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను సొంత ఇళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
అదే సమయంలో ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు తగ్గట్టుగా నేరుగా మంత్రులు ఆయా గ్రామాల్లో బస చేయాలని సీఎం ఆదేశించడం చర్చనీయాంశం అయ్యింది. కేవలం హామీలివ్వడం కాకుండా ఆచరణలో సహాయం అందించిన నేత, ఇప్పుడు మాటలు చెప్పడం కాకుం డా ప్రజల మధ్య ఉండేలా తన మంత్రివర్గ సహచరులను ఆదేశించడం విశేషం. ఈరోజు సాయంత్రానికి వెంకటాపురం వాసులంతా వారి సొంత ఇళ్లకు చేరబోతున్నారు. రాత్రికి వారితో పాటుగా మంత్రులు కన్నబాబుకి తోడుగా అవంతి శ్రీనివాస్ కూడా రాత్రి బస ఆ ప్రాంతంలోనే చేయబోతున్నారు. సహజంగా మంత్రులతో పాటుగా పలువురు సిబ్బంది, ఇతర స్థానిక నేతలు కూడా అక్కడే నిద్రించబోతున్నారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. జనంలో ఉన్న ఆందోళనను చల్లార్చేలా సీఎం తీసుకున్న నిర్ణయం స్థానికుల నమ్మకాన్ని మరింత పెంచబోతోందనే చెప్పవచ్చు. జనాలకు ముందుగా మంత్రులు ఉండడం ద్వారా మరోసారి ప్రభుత్వ నిబద్ధత తేటతెల్లం కాబోతోందని చెప్పక తప్పదు.