iDreamPost
android-app
ios-app

పథకాలు.. పేర్లు.. చంద్రబాబు బాటలో పయనిస్తున్న జగన్‌

పథకాలు.. పేర్లు.. చంద్రబాబు బాటలో పయనిస్తున్న జగన్‌

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాటలోనే ఆంధ్రప్రదేశ్‌లో నవ, యువ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా పయనిస్తున్నారా..? సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టడంతో చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటున్నారా..? అంటే అవుననే విశ్లేషకుల నుంచి సమాధానం వస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పేరును సంక్షేమ పథకాలకు ఎలా పెట్టారో.. ఇలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కూడా సీఎం జగన్‌ పేరును సంక్షేమ పథకాలకు పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఏ ప్రభుత్వమైనా.. సీఎం పేరును పథకాలకు పెట్టడం ఎవరూ హర్షించబోరని వారంటున్నారు.

విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారు.. ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు పేరును విరివిగా పెట్టింది. చంద్రన్న సంకాంత్రి కానుక, చంద్రన్న భీమా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న విద్యా దీపం, చంద్రన్న సంచార చికిత్స, చంద్రన్న బాట, చంద్రన్న విదేశీ విద్యా దీవెన, చంద్రన్న విద్యోన్నతి, చంద్రన్న స్వయం ఉపాధి, చంద్రన్న ఉన్నత విద్యా దీపం, చంద్రన్న క్రిస్మస్‌ కానుక, చంద్రన్న రైతు క్షేత్రం, చంద్రన్న భూసార పరీక్షలు, చంద్రన్న చేయూత, చంద్రన్న కాపు భవన్‌లు, చంద్రన్న డ్రైవర్ల ప్రమాద భీమా… ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన పేరు పెట్టుకున్నారు. ఈ విషయంపై అప్పట్లో రాజకీయ విశ్లేషకులు, అప్పడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ.. నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు, హేళనలు చేసింది.

Read Also: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ

విమర్శలకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలోనే పథకాలకు తన పేరు పెట్టుకుంటున్నారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన ఇలా సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టుకున్నారు. తాజాగా మధ్యాహ్న భోజనం పథకాన్ని జగనన్న గోరుముద్దలుగా మార్చారు. మధ్యాహ్న పథకం పేరు ఇలా మార్చడంపై విమర్శలొస్తున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంత మేలు చేయవచ్చునో దేశానికి చాటి చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 108, ఫీజురియంబర్స్‌మెంట్‌.. ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారు. 60 ఏళ్ల వయస్సున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నడూ కూడా సంక్షేమ పథకాలకు తన పేరు పెట్టుకోలేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేసినట్లు ఎక్కడా చర్చ జరగలేదు. ఆ పథకాలకు దేశం కోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధానులు రాజీవ్‌ గాంధీ, ఇందిరమ్మ, నెహ్రూ పేర్లును పెట్టారు.

Read Also: జ‌గ‌న్ కి జై అంటున్న సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌

చంద్రబాబు తొలి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తన పేర్లు పెట్టుకోలేదు. కానీ 2014లో 70వ పడికి సమీపిస్తున్న సమయంలో మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మాత్రమే పథకాలకు తన పేర్లు పెట్టుకున్నారు. కానీ వైఎస్‌ జగన్‌ 46 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత చిన్న వయస్సులోనే పథకాలకు తన పేరు పెట్టుకోవడం సరికాదని విమర్శలతోపాటు ఆయన్ను అభిమానిస్తున్న వారు చెబుతున్న మాట. ప్రభుత్వ పథకాలకు ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టినట్లే.. మరికొన్ని పథకాలకు జాతీ నేతలు పేర్లు పెట్టడం వల్ల సీఎం జగన్‌కు మరింత పేరు వస్తుందని, ప్రజలు హర్షిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

పథకాలకు తన పేర్లు పెట్టుకుంటున్నారని చంద్రబాబును విమర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలకు జగన్‌ పేరు పెట్టుకోవడంపై సమర్థించుకునేందుకు అనేక కారణాలు చెప్పవచ్చు. కానీ ప్రజలు హర్షించరు. మరి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇకపై ప్రవేశపెట్టబోయే పథకాలకు సీఎం జగన్‌ పేరును పెట్టకుండా ఉంటుందా..? లేక ఇదే ఒరవడిని కొనసాగిస్తుందా..? వేచి చూడాలి.